Iran vs Israel War
Iran vs Israel War : పశ్చిమాసియాలో నిప్పుల వాన కురుస్తూనే ఉంది. అమెరికా (US), ఇజ్రాయెల్ (Israel) యుద్ధ విమానాలు ఇరాన్ (Iran) పై కరంగా విరుచుకు పడుతున్నాయి. టెహ్రాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతను పెంచుతూనే ఉన్నాయి. పలితంగా తొమ్మిది రోజుల క్రితం ప్రారంభమైన యుద్ధం ఇప్పట్లో ముగిసే సంకేతాలు కనిపించడం లేదు. అయితే, తాజాగా.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యూకేపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యూకే ప్రధాని స్టార్మర్ విమర్శలు గుప్పించాడు. ఒక విధంగా వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Donald Trump: ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది- డొనాల్డ్ ట్రంప్ సంచలనం
పశ్చిమాసియాకు విమాన వాహక నౌకలను పంపించే విషయంపై యూకే ప్రభుత్వం ఇంకా తేల్చకపోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విమాన వాహకనౌకను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. అయితే, దీన్ని పశ్చిమాసియాకు తరలించే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని ఆ దేశానికి చెందిన ఓ అధికారి మీడియాతో పేర్కొన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా చేస్తున్న యుద్ధంతో తమ బలగాలు ప్రత్యక్ష్యంగా పాల్గొనబోవని, అయితే, తమ సైనిక స్థావరాలను ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కు అనుమతిస్తున్నట్లు యూకే ప్రధాని స్టార్మర్ ఇటీవల తెలిపారు. యూకే నిర్ణయంపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘ఒకప్పుడు యూకే తమ మిత్రదేశం. పశ్చిమాసియాకు రెండు విమాన వాహక నౌకలను తరలించే విషయంపై వారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అమెరికా బలగాలకు ఇప్పుడు వాటి అవసరం లేదు. ఈ చర్యను తాము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. యుద్ధం గెలిచిన తరువాత చేరే వ్యక్తులు తమకు అవసరం లేదు’ అంటూ యూకే ప్రధాని స్టార్మర్ కు ట్రంప్ ఓ విధింగా వార్నింగ్ ఇచ్చారు.
ఖమేనీ కుమారుడికి గాయాలు..
ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఆపరేషన్ లయన్స్ రోర్‌లో భాగంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా 40మంది కీలక నేతలు, జనరల్స్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, అదే దాడిలో ఇరాన్ తదుపరి నేతగా భావిస్తున్న ముజ్తబా హొస్సేనీ ఖమేనీ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడి నుంచి ఆయన ప్రాణాలతో బయటపడినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనంలో పేర్కొంది. ఈ దాడిలో ముజ్తబా భార్య జాహ్రా కూడా మరణించారు. ప్రస్తుతం ముజ్తబా హొస్సేనీ ఖమేనీ గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచాురం. ముజ్తబాకు ఇరాన్ లోని శక్తిమంతమైన ఐఆర్‌జీసీపై గట్టి పట్టుఉంది. దీంతో ఆయనే ఖమేనీ స్థానాన్ని భర్తీ చేస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.