ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ కొందరు పరువు, ప్రతిష్ట, కులం పేరుతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టిన పిల్లల కన్నా కొందరికి పరువు, ప్రతిష్టలే ముఖ్యంగా మారాయి. పరువు పేరుతో కన్న పిల్లలనే కడ తేరుస్తున్నారు. మన దేశంలోనే కాదు ఇరాన్ లో అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తన మైనర్ కూతురు 28 ఏళ్ల యువకుడితో పారిపోయి తన పరువు తీసిందనే కోపంతో ఆ కసాయి తండ్రి కన్న కూతురి తల నరికేశాడు.
కన్నకూతురి తల నరికేస్తే ఇంత తక్కువ శిక్షా:
కొన్ని నెలల క్రితం గిలాన్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసుకి సంబంధించి ఇటీవలే దోషికి శిక్ష ఖరారైంది. దోషికి 9 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆ కసాయి తండ్రికి విధించిన శిక్ష ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్నకూతురి(14) తల నరికేసిన ఇరాన్ జాతీయుడికి కేవలం తొమ్మిదేళ్ల జైలు శిక్షే పడటంతో ఇరాన్ చట్టాలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలకు పురుషులే రక్షకులుగా భావించే సమాజంలో పురుషుల హక్కులకే ఎక్కువ ప్రధాన్యాత లభిస్తోందంటూ అంతర్జాతీయ న్యాయనిపుణుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఇరాన్ లో పరువు హత్యలు కామన్:
ఇంతటి దుర్మార్గుడికి కేవలం తొమ్మిదేళ్ల శిక్ష పడటమేమిటని బాధితురాలి తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబ పరువు తీసినందుకు కూతరు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాలంటూ నిందితుడు తనకు చెప్పాడని ఆమె వాపోయింది. కాగా.. ఈ ఘటన ప్రస్తుతం ఇరాన్‌లో కలకలానికి దారితీస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి పరువు హత్యలు తరచూ జరుగుతుంటాయని, దీన్ని ప్రభుత్వం కూడా అడ్డు కోవట్లేదని అక్కడి వారు అంటున్నారు.
తన కంటే వయసులో 15ఏళ్ల పెద్దవాడితో పారిపోయిందని:
బాధితురాలి పేరు రొమినా. వయసు 14 ఏళ్లు. వయసులో తనకన్న 15ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని ప్రేమించింది. అతడిని పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పగా, అతడు నిరాకరించాడు. దీంతో తండ్రికి చెప్పకుండా రొమినా ఇంట్లో నుంచి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత రొమిని ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడు ఏమీ అనని తండ్రి, ఓ రోజు రాత్రి కూతురు నిద్రలో ఉండగా, అదను చూసి ఆమె తల నరికేశాడు. కాగా, రొమినాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది.
ఇరాన్ చట్టాలపై తీవ్ర విమర్శలు:
ఇరాన్ చట్టాల ప్రకారం పరువు హత్య కేసుల్లో గరిష్టంగా పదేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అదే హత్య కేసుల్లో అయితే జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించేలా చట్టాలు రూపొందించారు. కూతురు తల నరికిన తండ్రికి కేవలం 9 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే విధించడంతో ఇరాన్ చట్టాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.