Iran Attacks : గ్యాస్ సంక్షోభం మరింత పెరగబోతుందా..? ఖతార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ దాడి..
Iran Attacks World Biggest Gas Hub In Qatar : ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థికవ్యవస్థకు పునాది.
- Harishth Thanniru
- Published On : March 19, 2026 / 02:52 PM IST
Iran Attacks World Biggest Gas Hub In Qatar
- ఖతార్ గ్యాస్ జీవనాడిపై దాడి
- రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై క్షిపణుల వర్షం
- గ్యాస్ సంక్షోభం మరింత పెరగబోతుందా…?
Iran Attacks World Biggest Gas Hub In Qatar : ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌తోపాటు గల్ప్ దేశాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా.. బుధవారం అర్ధరాత్రి తరువాత ఖతార్‌లోని ఖతారీ కాంప్లెక్స్ అనే ఎల్ఎన్‌జీ (Liquefied Natural Gas) ప్లాంట్ పై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో ప్లాంట్ భారీ ఎత్తున దెబ్బతిన్నట్లు గల్ఫ్ ఆఫ్ మీడియా వెల్లడించింది. ప్రపంచానికి ఐదు వంతుల గ్యాస్ సరఫరా అయ్యేది ది రాస్ లఫాన్ ఇండస్ట్రీయల్ సిటీ ప్లాంట్ నుంచే. ఈ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేయడం ఆందోళన కలిగించే అంశం. మరోవైపు చమురు ధరలు ఈ దాడుల తరువాత 110 డాలర్లకు చేరాయి.
ఖతార్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైనది రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీ. ఇక్కడి గ్యాస్ ప్లాంట్ల నుంచే ప్రపంచానికి ఐదు వంతుల గ్యాస్ సరఫరా అవుతుంది. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లో 47శాతం ఖతార్ నుంచే లభిస్తుంది. ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ స్పందిస్తూ ఇరాన్ క్షిపణి దాడుల్లో పెద్ద సంఖ్యలో గ్యాస్ కేంద్రాల్లో నిప్పులు చెలరేగి దెబ్బతిన్నట్లు వెల్లడించింది.
ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్‌జీ ఎగుమతి టెర్మినల్ పై ఇరాన్ దాడి చేసిందని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. ఇరాన్ లక్ష్యంగా చేసుకొని చేసిన దాడుల ఫలితంగా రాస్ లాఫాన్ ప్రాంతంలో చెలరేగిన మంటలను పౌరరక్షణ బృందాలు అదుపు చేస్తున్నాయని ఎక్స్ లో పోస్టు చేశారు.
ఈవారం ప్రారంభంలో ఇజ్రాయెల్ తన అతిపెద్ద గ్యాస్ క్షేత్రంపై దాడి చేసిన నేపథ్యంలో.. గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటి వరకు ప్రాణనష్టం జరగలేదని, కానీ, భారీ నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ సంస్థ తెలిపింది.
ట్రంప్ సీరియస్ వార్నింగ్..
ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమాయకపు ఖతార్ పై ఇరాన్ తెలివి తక్కువగా దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇదే కొనసాగితే ఇజ్రాయెల్ సాయం ఉన్నా లేకపోయినా తాము ఇరాన్ పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో పార్స్ గ్యాస్ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
గ్యాస్ సంక్షోభం మరింత పెరుగుతుందా..?
ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థికవ్యవస్థకు పునాది. ఈ దాడిలో భారీ స్థాయిలో ఇది దెబ్బతిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేయడం.. ప్రపంచాన్ని మరింత గ్యాస్ సంక్షోభంలోకి నెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లో 47శాతం ఖతార్ నుంచే లభిస్తుంది. ప్రస్తుతం ఇరాన్ దాడి వల్ల భారత్‌లో తలెత్తిన గ్యాస్ సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతుంది.
