Afghanistan : యుద్ధ వాతావరణం.. రాకెట్లతో దాడికి ఉగ్రవాదుల ప్రయత్నం

కాబుల్ విమానాశ్రయం వద్ద ఉన్న అమెరికా సైనికులపై రాకెట్లను విసిరింది ఐసిస్-కె. వీటిని యాంటీ రాడార్ సిస్టం గాల్లోనే పీల్చేసింది.

Afghanistan (2)

Afghanistan : ఐసిస్ – కె ఉగ్రవాదులే టార్గెట్ గా అఫ్ఘాన్ లో అమెరికా దళాలు దాడులు చేస్తున్నాయి. కొత్త సాంకేతికతతో శత్రువును గుర్తించి మట్టుబెడుతున్నాయి అమెరికా బలగాలు. అటు ఐసిస్-కె ఉగ్రవాదులు కూడా అఫ్ఘాన్ లో మరోసారి రక్తపాతం సృష్టించేందుకు ప్రణాలికలు సిద్ధం చేశారు. గత వారం ఆత్మహుతి దాడి చేసి సుమారు 120 మందిని పొట్టన పెట్టుకున్న ఐసిస్ – కె.. మరోసారి పెద్ద విధ్వంసానికి ప్లాన్ వేసింది.

ఈ ప్లాన్ ను అమెరికా బలగాలు పసిగట్టడంతో నిర్వీర్యం అయింది. సోమవారం కాబుల్ విమానాశ్రయం వద్ద ఉన్న అమెరికా బలగాలే లక్ష్యంగా ఐసిస్ – కె ఐదు రాకెట్లు విసిరింది. దీనిని పసిగట్టిన అమెరికా రాడార్లు గాల్లోనే పేల్చివేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఇక ఈ దాడికి వ్యూహరచన చేసిన ఉగ్రవాదిని అమెరికా బలగాలు ఆదివారం మట్టుబెట్టాయి. అతడిని హతమార్చిన మరుసటిరోజే ప్రతీకార దాడి చేయాలనీ ఐసిస్ భావించింది. ఈ నేపథ్యంలోనే రాకెట్ బాంబులను విసిరింది. అమెరికా రాడార్లు అప్రమత్తంగా ఉండటంతో దానిని గాల్లోనే పేల్చివేశారు.

ఇక నిన్న ఐసిస్ – కె ఉగ్రవాదిపై దాడి చేసిన ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. చిన్నారుల్లో ఒకరు రెండేళ్ల వయసు వారు ఉన్నట్లు సీఎన్ఎన్ వార్త పత్రిక తెలిపింది. పేలుళ్ల దాటికి వారి శరీరభాగాలు ముక్కలైనట్లు స్థానికంగా ఉన్నవారు చెబుతున్నారు. వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదని తెలిపారు. శరీరాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయని వివరించారు.