Hezbollah Top Commander Killed (Photo Credit : Google)
Israel Hezbollah War : హెజ్ బొల్లాకు మరో షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఇప్పటివరకు హమాస్ కమాండర్లను ఖతం చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ.. ఇప్పుడు హెజ్ బొల్లా కమాండర్లపై కన్నేసింది. పక్కా ప్లాన్ తో వారిని మట్టుబెడుతోంది. తాజా దాడుల్లో హెజ్బొల్లా టాప్ కమాండర్ హతమయ్యాడు. హెజ్బొల్లా టాప్ కమాండర్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.
నాసర్ బ్రిగేడ్ మిసైల్స్ అండ్ రాకెట్స్ యూనిట్ కు చెందిన జాఫర్ ఖాదర్ ఫార్ ను దక్షిణ లెబనాన్ లో హతం చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ పై చోటు చేసుకున్న పలు రాకెట్ దాడుల వెనుక జాఫర్ హస్తం ఉన్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ పై జరిగిన పలు దాడుల వెనుక జాఫర్ ఉన్నాడని, మాజ్ దల్ శామ్స్ పై రాకెట్ దాడిలో 12మంది చిన్నారులు మృతి చెందడం, గత వారం మెతులా ఘటనలో ఐదుగురు ఇజ్రాయెల్ పౌరులు చనిపోయిన ఘటన వెనుక కూడా జాఫర్ ఉన్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది.
గత నెల 8న తూర్పు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పై హెజ్ బొల్లా చేపట్టిన రాకెట్ దాడులు జాఫర్ ఆధ్వర్యంలో చోటు చేసుకున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ ఘటనకు ముందు ఉత్తర లెబనాన్ లో సీనియర్ హెజ్బొల్లా ఆపరేటివ్ ను బంధించినట్లు ఇజ్రాయెల్ నేవీ బృందం పేర్కొంది. అయితే, పట్టుకున్న వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. బందీ చేసిన వ్యక్తిని ఇజ్రాయెల్ కు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు లెబనాన్ కు చెందిన నేవీ కెప్టెన్ ను కొందరు అపహరించారు. ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్ పాత్ర ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టినట్లు లెబనీస్ అధికారులు పేర్కొన్నారు. అపహరణకు గురైన నేవీ కెప్టెన్ కు హెజ్బొల్లాతో సంబంధాలు ఉండవచ్చని లెబనాన్ మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. తమ సభ్యుడు ఒకరిని ఇజ్రాయెల్ బలగాలు బందీ చేశాయని హెజ్బొల్లా ధృవీకరించింది.
Also Read : కసబ్ ఖతం..! బీరుట్‌లోని జనావాసాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..