కసబ్ ఖతం..! బీరుట్‌లోని జనావాసాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..
ఇప్పటివరకు లెబనాన్ కు చెందిన 2వేల 800 మంది ప్రాణాలు కోల్పోగా.. 13వేల మందికిపైగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Israel Hezbollah War (Photo Credit : Google)
Israel Hezbollah War : హెజ్బొల్లా పుట్టినిల్లు లెబనాన్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష దాడులు జరిగిన నేపథ్యంలో టెల్ అవీవ్ పై ఇటీవల హెజ్ బొల్లా కూడా దాడులను ఉధృతం చేసింది. ఈ క్రమంలోనే బీరుట్ లోని దహియే ప్రాంతంలో జనావాసాలపై వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. హెజ్ బొల్లాకు చెందిన కీలక నేతే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 52 మంది మృతి చెందారు. 72 మంది గాయపడ్డారు. మరోవైపు దాడుల కారణంగా దక్షిణ బీరుట్ లో పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. దాడులపై లెబనాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ సేనలు బాంబు దాడులు చేసినట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు ప్రకటన విడుదల చేసింది.
గతేడాది అక్టోబర్ 8న ఇజ్రాయెల్ పై హెజ్ బొల్లా రాకెట్లు ప్రయోగించినప్పటి నుంచి ఇప్పటివరకు లెబనాన్ కు చెందిన 2వేల 800 మంది ప్రాణాలు కోల్పోగా.. 13వేల మందికిపైగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు హమాస్ కు చెందిన సీనియర్ అధికారి ఇజ్ అల్ దిన్ కసబ్ ను హతమార్చినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. కసబ్ గాజా స్ట్రిప్ లోని ఇతర సమూహాలను సమన్వయం చేయడానికి బాధ్యత వహిస్తాడని పేర్కొంది. కసబ్ మరణానికి పాలస్తీనా అధికారులు సంతాపం తెలిపారు.
అటు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఏడాదికి పైగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో గాజాలోని 43వేల మంది మరణించారు. ఈ మేరకు పాలస్తినీయన్ అధికారులు ప్రకటించారు. 2023 అక్టోబర్ 7న హమాస్ కు చెందిన మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చారు. సుమారు 250 మందిని అపహరించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సేనలు దాడులకు దిగాయి. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది.
Also Read : అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుంది?