Donald Trump: భారత్‌కు ట్రంప్ గుడ్‌న్యూస్.. టారిఫ్‌లపై కీలక ప్రకటన
ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. రష్యా చమురు కొనుగోలు చేయకూడదని.. అమెరికా, వెనిజులా చమురు కొనుగోళ్లను పెంచాలని ఢిల్లీ అంగీకరించిందని ట్రంప్ తెలిపారు.
Trump Modi Representative Image (Image Credit To Original Source)
- ప్రధాని మోదీ శక్తిమంతమైన నాయకుడు అని ట్రంప్ కితాబు
- రష్యా నుంచి చమురు కొనుగులు ఆపేందుకు అంగీకరించారు
- ట్రంప్ కు ప్రధాని మోదీ బిగ్ థ్యాంక్స్
- ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం కీలకమన్న మోదీ
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు గుడ్ న్యూస్ చెప్పారు. టారిఫ్ లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం విధించిన టారిఫ్ లు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీనిపై ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడనని, ఆయన నాకు మంచి స్నేహితుడని చెప్పారు. అంతేకాదు శక్తిమంతమైన నాయకుడు అంటూ మోదీని కీర్తించారు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేందుకు.. అమెరికా, వెనెజువెలా నుంచి కొనుగోలు చేయడానికి మోదీ అంగీకరించారని ట్రంప్ వెల్లడించారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది అని ట్రంప్ తెలిపారు.
ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. రష్యా చమురు కొనుగోలు చేయకూడదని.. అమెరికా, వెనిజులా చమురు కొనుగోళ్లను పెంచాలని ఢిల్లీ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. భారత్ పై టారిఫ్ లు తగ్గింపునకు ప్రతిఫలంగా అమెరికాపై విధిస్తున్న సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత్ ముందుకొస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడానికి భారత్, అమెరికా రెండూ కృషి చేస్తాయని ట్రంప్ తెలిపారు. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేసిన వెంటనే ప్రధాని మోదీ స్పందించారు. భారతీయ వస్తువులపై సుంకాలను తగ్గించినందుకు ట్రంప్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ట్రంప్ ప్రధాని మోదీని గొప్ప స్నేహితుడిగా భావిస్తారు..
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత్ లోని యూఎస్ రాయబారి సెర్గియో గోర్ స్పందించారు. ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. “నేను చాలాసార్లు చెప్పినట్లుగా, అధ్యక్షుడు ట్రంప్ నిజంగా భారత ప్రధాని మోదీని గొప్ప స్నేహితుడిగా భావిస్తారు. ఈ సాయంత్రం వాణిజ్య ఒప్పందం వార్తలతో నేను చాలా సంతోషిస్తున్నా. యునైటెడ్ స్టేట్స్ – భారత్ మధ్య సంబంధానికి అపరిమితమైన శక్తి ఉంది” అని పోస్ట్ లో వెల్లడించారు.
ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం..
భారత్ పై ప్రతీకార టారిఫ్ లను 25శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. “ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 1.4 బిలియన్ల భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు పెద్ద ధన్యవాదాలు” అని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని మోదీ తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్ కి కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం కీలకం అని ప్రధాని మోదీ అన్నారు.
”మేడిన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలను 18శాతానికి తగ్గించడం అద్భుత నిర్ణయం. భారత్, అమెరికా సహకారం రెండు దేశాలకు ఎంతో ప్రయోజనకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రంప్ తో కలిసి పని చేయాలని ఆశిస్తున్నా. ప్రపంచంలో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పని చేస్తున్నాయి” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
Wonderful to speak with my dear friend President Trump today. Delighted that Made in India products will now have a reduced tariff of 18%. Big thanks to President Trump on behalf of the 1.4 billion people of India for this wonderful announcement.
When two large economies and the…
— Narendra Modi (@narendramodi) February 2, 2026
Also Read: భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ చేసినా ICC మమ్మల్ని ఏమీ చేయలేదు.. పాక్ పిచ్చి లాజిక్..
