గని కుప్పకూలి 200 మందికిపైగా మృతి.. సజీవంగా మట్టిలో కూరుకుపోయి..
ప్రపంచ కోల్టాన్ ఉత్పత్తిలో రుబాయా గని నుంచి ఉత్పత్తయ్యే కోల్టాన్ సుమారు 15 శాతంగా ఉంది.
Rubaya coltan mine (Image Credit To Original Source)
- కాంగోలోని రుబాయాలో ఘటన
- వర్షాల వల్ల గనిలో ప్రమాదం
- “కోల్టాన్” గనుల కేంద్రంగా రుబాయా ప్రసిద్ధి
DR Congo: కాంగోలోని రుబాయా “కోల్టాన్” గని కుప్పకూలడంతో 200 మందికి పైగా మృతి చెందారని అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ తెలిపింది. ఆ ప్రావిన్స్ గవర్నర్ ప్రతినిధి లుముంబా కంబెరె ముయిసా ఈ ప్రమాదం గురించి మీడియాకు వివరాలు తెలిపారు. కోల్టాన్ గనుల కేంద్రంగా ప్రసిద్ధి.
“కొండచరియలు విరిగిపడడంతో 200 మందికి పైగా మృతి చెందారు. మృతుల్లో గని కార్మికులు, పిల్లలు, మహిళలు ఉన్నారు. గనిలో చిక్కుకుపోయిన కొందరిని సరైన సమయానికి బయటకు తీసుకువచ్చారు. సుమారు 20 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది” అని ముయిసా చెప్పారు.
Also Read: ధరలు డమాల్.. నమ్మశక్యంకాని రీతిలో భారీగా తగ్గిన బంగారం, వెండి రేట్లు.. ఇప్పుడే కొంటే..
ఉత్తర కివు ప్రావిన్స్ రాజధాని గోమా నగరానికి వాయవ్యంగా సుమారు 60 కిలోమీటర్ల దూరంలో “కోల్టాన్” గని ఉంటుంది. బుధవారమే ఇది కూలినప్పటికీ, శుక్రవారం సాయంత్రం వరకు మృతుల సంఖ్యపై స్పష్టత రాలేదు.
ఉత్తర కివు ప్రాంతంలో సాధారణంగా జనవరి నుంచి మే వరకు వర్షాకాలం ఉంటుంది. “వర్షాకాలం కొనసాగుతోంది. నేల పెళుసులుగా మారింది. బాధితులు గనిలోపల ఉన్న సమయంలో అది కూలిపోయింది” అని ముసియా అన్నారు.
కొన్ని మృతదేహాలను వెలికితీశామని అధికారులు అన్నారు. అయితే, మృతులు, గాయపడిన వారి సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు. భారీ ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అధికారులు సూచించారు.
“వర్షం పడ్డాక కొండచరియలు విరిగిపడ్డాయి. కొందరు సజీవంగా మట్టిలో కూరుకుపోయారు. మరికొందరు సొరంగాల్లో చిక్కుకున్నారు” అని అధికారులు చెప్పారు.
ప్రపంచ కోల్టాన్ ఉత్పత్తిలో రుబాయా గని నుంచి ఉత్పత్తయ్యే కోల్టాన్ సుమారు 15 శాతంగా ఉంది. ఈ ఖనిజం టాంటలం(రసాయన మూలకం)గా ప్రాసెస్ అవుతుంది. ఈ లోహానికి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, అంతరిక్ష భాగాలు, గ్యాస్ టర్బైన్లు తయారీలో భారీ డిమాండ్ ఉంది. టాంటలం అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే ఓ లోహం.
