Israel - Hamas ceasefire
Israel – Hamas ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒప్పందం స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30గంటలకు అమల్లోకి రావాల్సి ఉండగా.. దాదాపు మూడు గంటలు ఆలస్యమైంది. హమాస్ నుంచి ఇజ్రాయెల్ బందీల జాబితా విడుదలలో జాప్యం కావడంతో తొలుత శాంతి ఒప్పందం అమలుపై సందిగ్దత నెలకొంది. చివరకు ఇజ్రాయెల్ కు చెందిన ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేసింది. గాజాకు చేరుకున్న రెడ్ క్రాస్ ప్రతినిధులకు ఈ బందీలను అప్పగించింది. హమాస్ విడుదల చేసిన బందీల్లో రోమి గోనెన్ (24), ఎమిలీ దమారీ (28), డోరాన్ స్టెయిన్ బ్రేచర్ (31)లు ఉన్నారు. వారిని రెడ్ క్రాస్ ప్రతినిధులు ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించారు.
ఇజ్రాయెల్ బందీలు సొంత గడ్డపై అడుగు పెట్టగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. బందీల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. బందీల విడుదల దృశ్యాలను వీక్షించేందుకు టెలీ అవీవ్ లో వేల సంఖ్యలో ప్రజలు గుమ్మికూడారు. ఇందుకోసం రోడ్లపై పలుచోట్ల పొడవైన స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన సందర్భంగా గాజాలో ప్రజలు ర్యాలీలు తీశారు. చాలా మంది ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు.
ఒప్పందంలో భాగంగా 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు. వారిలో మైనర్లు, మహిళలు ఉన్నారని పాలస్తీనా అధికారులు తెలిపారు. రాళ్లు విసరడం, హత్యాయత్నం వంటి నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ వీరిని అరెస్టు చేసింది. అయితే, మొదటి దశలో కాల్పుల విరమణ 42రోజుల పాటు కొనసాగుతుంది. ఈ దశలో 33 మంది బందీలు, దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలు దశల వారిగా విడుదలవుతారని భావిస్తున్నారు. ఒప్పందంలో భాగంగా మొదటి దశలో ఇజ్రాయెల్ దళాలు జనావాస ప్రాంతాల నుంచి వైదొలుగుతాయి. అదేవిధంగా గాజాలోకి ఆహారం, నీరు, ఇతర మౌలిక సదుపాయాలను అందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం అనుమతిస్తుంది.
రెండో దశలో మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తుంది. అయితే, రెండో దశ సమయానికి ఇజ్రాయెల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధవాతావరణం నెలకుంటుందా అనే ఆందోళనసైతం వ్యక్తమవుతుంది. హమాస్ ఈ ఒప్పందాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరుకుంటుంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా, 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 46,000 మందికిపైగానే పాలస్తానీయులు మృతిచెందారు. అయితే, దాదాపు పదిహేను నెలలుగా సాగుతున్న యుద్ధానికి తాజాగా కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడింది. ఈ ఒప్పందం సుదీర్ఘంగా కొనసాగుతుందా.. అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
This is the moment the three Israeli hostages – Emily Damari, Romi Gonen, and Doron Steinbrecher – were transferred to the Red Cross by Hamas in Gaza City. pic.twitter.com/JrvBRKc1DC
— Sky News (@SkyNews) January 19, 2025