Israel PM : తేడా వస్తే తీవ్రస్థాయిలో స్పందిస్తాం..హమాస్ కు నెతన్యాహు వార్నింగ్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు..హమాస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Israel Pms Warning On Very Powerful Response If Hamas Breaks Calm

Israel PM ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు..హమాస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము తీవ్రస్థాయిలో స్పందిస్తామని నెతన్యాహు తేల్చి చెప్పారు. కాల్పుల విరమణను ఏకీకృతం చేయడానికి అమెరికా తరపున చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇజ్రాయెల్‌ లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తో సమావేశం అనంతరం నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ..హామాస్ గనక శాంతిని భగ్నం చేసి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తే మా సమాధానం అత్యంత పవర్‌ఫుల్‌ గా ఉంటుందని తెలిపారు.

కాగా, ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదులకు మధ్య 11 రోజుల పాటు జరిగిన భీకర దాడులు..ఐదు రోజుల క్రితం పరస్పర శాంతి ఒప్పందంతో సద్దుమనిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరిగిన హింసలో దాదాపు 200 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందగా..వందల మంది నిరాశ్రయులయ్యారు.వేల సంఖ్యలో గాజా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. హమాస్‌ ఉగ్రవాదులు కొన్ని వేల సంఖ్యలో రాకెట్లతో ఇజ్రాయెల్‌ పై దాడి చేశారు. దీంతో ఇజ్రాయెల్ వైపు కూడా ప్రాణనష్టం జరిగింది.

మరోవైపు హమాస్‌ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ సేనలు దాడికి పాల్పడ్డాయి. రాకెట్లు, విమానాలతో గాజా స్ట్రిప్‌ పై విరుచుకుపడింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌ పై ఒత్తిడి వచ్చింది. మొదటి నుంచి ఇజ్రాయెల్‌ కు మద్దతుగా ఉన్న అమెరికా కూడా హింస తగ్గేవిధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దాడులను తక్షణం ఆపేయాలంటూ ఇస్లామిక్‌ దేశాలు మొదటినుంచి డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య కీలక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.