×
Ad

జపాన్‌ మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన సనాయి తకాయిచి.. ఎవరు ఈమె.. అంతగా ఎలా ఎదిగారు?

జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సనాయి తకాయిచికి భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రపంచ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Sanae Takaichi

Sanae Takaichi: జపాన్‌ పార్లమెంట్‌ మంగళవారం దేశ తొలి మహిళా ప్రధానిగా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, అల్ట్రా కన్జర్వేటివ్ సనాయి తకాయిచిని ఎన్నుకుంది. ఆమె పార్టీ మరో పార్టీతో కూటమి ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న మరుసటి రోజే ఈ ఎన్నిక జరిగింది.

జపాన్ పీఎం పదవికి షిగేరు ఇషిబా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో ఏడాదిగా విభేదాలు నెలకొనడంతో ఆయన రాజీనామా చేశారు. దీంతో ఇవాళ పార్లమెంట్‌ కొత్త ప్రధానిని ఎన్నుకుంది. ( Sanae Takaichi)

Also Read: నిజామాబాద్‌ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం.. 300 గజాల ఇంటి స్థలం: రేవంత్‌ రెడ్డి ప్రకటన

జపాన్‌ ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ ఆ దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర అంతగా లేదు. జపాన్‌ లింగ సమానత్వంలో వెనకబడిందన్న విమర్శలు ఉన్నాయి. అన్ని సవాళ్లనూ ఎదుర్కొని సనాయి తకాయిచి ప్రధాని స్థాయికి ఎదిగారు.

ఇటీవలే అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ)కి సనాయి తకాయిచి నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు పార్లమెంటులోనూ ఆమె ఎన్నిక ఖరారైంది.

ఈ వారాంతంలో ప్రధానిగా తకాయిచి తన విధానాల గురించి ప్రసంగం చేస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో త్వరలోనే భేటీ కావాల్సి ఉంది. అలాగే, ప్రాంతీయ సదస్సుల్లో ఆమె పాల్గొంటారు. జపాన్‌లో ధరల పెరుగుదల సమస్యను ఎదుర్కొని, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించాల్సి ఉంది. డిసెంబర్‌ చివరి నాటికి ఆమె ఆర్థిక ప్రోత్సాహక పథకాలు రూపొందించాలి.

ఎవరీ సనాయి తకాయిచి?

జపాన్‌లోని నారాలో ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని కుటుంబంలో జన్మించారు సనాయి తకాయిచి. ఆమె బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చదివారు. పబ్లిక్‌ సర్వీస్‌లో కోర్సు కూడా చేశారు. ఆమెకు మోటార్‌ సైకిళ్లంటే ఇష్టం. 1993లో రాజకీయాల్లో ప్రవేశించి, అంచెలంచెలుగా ఎదిగారు.

ఎకనామిక్‌ సెక్యూరిటీ మినిస్టర్‌ పదవితో పాటు పలు కీలక పదవుల్లో కొనసాగారు. బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి, ఐరన్‌ లేడీ మార్గరెట్‌ థాచర్‌ను సనాయి తకాయిచి ఆదర్శంగా తీసుకున్నారు. జాతీయ రక్షణ విషయంలో సనాయి తకాయిచి కఠిన వైఖరి తప్పనిసరి అని చెబుతుంటారు. ఆమెను ‘ఐరన్‌ లేడీ 2.0’ అని అంటుంటారు.

జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సనాయి తకాయిచికి భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు ప్రపంచ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.