జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత : కృష్ణ సోబ్తి మృతి 

  • Publish Date - January 26, 2019 / 05:42 AM IST

ఢిల్లీ : ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కృష్ణ సోబ్తి తన 93 ఏట జనవరి 25న కన్నుమూశారు. కృష్ణసోబ్తి తన సాహితీ ప్రస్థానంలో పలు అంశాలపై పుస్తకాలు రాశారు. భారతీయ భాషలతోపాటు స్వీడిష్, రష్యన్, ఇంగ్లిష్ భాషల్లోకి సోబ్తి రచనలు అనువాదంగా మారాయి. భారతీయ సమాజంలో మార్పులకు లోనవుతున్న స్త్రీ పురుష సంబంధాలు, తగ్గుతున్న మానవీయ విలువలు వంటి తదితర అంశాలను తన రచనల్లో వుండేవి. అంతేకాదు భారత ఉపఖండం విభజన, మారుతున్న దార్ సే బిచ్చుది, మిత్రో మర్జానీ, జిందగీనామా, దిల్ ఓ డానిష్, బడాలోమ్ కే ఘేరే, ఎయ్ లడ్కీ, గుజరాత్ పాకిస్థాన్ సే గుజరాత్ హిందుస్థాన్ వంటి పలు రచనలు ఎంతగానో ప్రజాదరణ పొందాయి. ఆమె సాహితీ రంగంలో చేసిన కృషికి..హిందీ అకాడమీ అవార్డులు, శిరోమణ్ అవార్డులు, మైథిలీ శరణ్ గుప్తా సమ్మాన్, సాహిత్య అకాడమీ ఫెలోషిప్, పద్మభూషణ్ తదితర పురస్కారాలను సోబ్తి అందుకున్నారు. 

2017లో సోబ్తికి జ్ఞానపీఠ్ అవార్డు
ప్రసిద్ధ హిందీ సాహితీవేత్త కృష్ణ సోబ్తి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండే సాహసోపేత వ్యక్తులను సోబ్తి తన కథల్లో సృష్టించారని.. నూతన రచనారీతులతో ప్రయోగాలు చేయటంలో ఆమె రచనలు పేరు పొందాయని జ్ఞానపీఠ్ కమిటీ సోబ్తిపై ప్రశంసలు కురిపించింది. 
హిందీ, ఉర్దూ, పంజాబీ సమ్మిళిత సంస్కృతి ఆమె రచనల్లో, భాషలో కనిపిస్తుంది. నవలా రచనలో సోబ్తి  ఎన్నో వినూత్న అంశాలను నూతన మార్గాలను నిర్మించారు. హిందీ సాహిత్యాన్ని ఆమె రచనలు సుసంపన్నం చేశాయి అని 2017 జ్ఞానపీఠ్ పురస్కారం ఎంపిక కమిటీ అధ్యక్షుడు ప్రముఖ సాహితీ పరిశోధకుడు, రచయిత, విమర్శకుడు నామ్‌వార్‌సింగ్ పేర్కొన్నారు. కృష్ణ సోబ్తి 1925లో (ఉమ్మడి భారతం)పంజాబ్‌లోని గుజరాత్ అనే నగరంలో జన్మించారు. (పాకిస్థాన్‌)లో ఉంది. సోబ్తి మృతిపై పలువురు సాహిత్యవేత్తలు,  ప్రముఖ రాజకీయ నేతలు, బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.