అయ్యో.. చైనా యువతకు ఎంత కష్టమొచ్చింది..! డబ్బులు చెల్లించి ఆఫీసుల్లో పనిచేస్తున్న నిరుద్యోగులు.. ఎందుకంటే..?
చైనాలో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. ఆ దేశంలో 16 నుంచి 24ఏళ్ల మధ్య వయసున్న యువత నిరుద్యోగం 14.5శాతంకు చేరింది.

China
China: చైనాలో వింత ట్రెండ్ నడుస్తోంది. ఆ దేశంలో కంపెనీలకు డబ్బులు చెల్లిస్తూ, ఉద్యోగం చేస్తున్నట్లు నటించే నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఇలాంటి సర్వీసు అందిస్తున్న కంపెనీల సంఖ్య కూడా అక్కడ పెరుగుతుంది. ఇది కాస్త.. వినటానికి వింతగా ఉన్నా.. చైనాలో ప్రస్తుతం ఇదో ట్రెండ్‌గా మారింది.
చైనాలో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. ఆ దేశంలో 16 నుంచి 24ఏళ్ల మధ్య వయసున్న యువత నిరుద్యోగం 14.5శాతంకు చేరింది. జెన్ జెడ్ గ్రాడ్యుయేట్లు ప్రతిష్టాత్మక డిగ్రీలతో కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. కానీ, వారికి సరిపడా ఉద్యోగాలు అందుబాటులో లేకపోవటంతో చాలామంది నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించే వేటలో వెనుకబడిపోతున్నారు. దీంతో కొంత మంది యువకులు డబ్బులు చెల్లించి ఆఫీసుల్లో పనిచేస్తున్నట్లు నటిస్తున్నారు.
ఈ ఆఫీసుల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, మీటింగ్ రూమ్‌లు, టీ, కాఫీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అక్కడ చూస్తే నిజంగా ఆఫీసు నడుస్తున్నట్లు అనిపిస్తుంది. దీని ఉద్దేశం కేవలం సమయం గడపడం కాదు.. తాము ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామనే భావనను కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రతీరోజూ 30 నుంచి 50 యువాన్లు అంటే.. రూ. 300 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు.
డోంగ్గువాన్ నగరానికి చెందిన 30ఏళ్ల షుయ్ జుకు ఫుడ్ బిజినెస్ ఉంది. 2024లో అది మూతపడింది. దీంతో ఆయన ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రోజుకు 30యావాన్లు చెల్లిస్తూ ప్రిటెండ్ టు వర్క్ అనే కంపెనీకి వెళ్తున్నారు. అతనితోపాటు మరో ఐదుగురు కూడా పనిచేస్తున్నారు. అయితే, ఘయ్ జు మాట్లాడుతూ.. నాకు చాలా సంతోషంగా ఉంది. మేమంతా ఒక గ్రూప్‌గా కలిసి పని చేస్తున్నట్లు అనిపిస్తోందని చెప్పాడు.
చైనాలోని షెన్‌జెన్, షాంఘై, నాంజింగ్, వుహాన్, చెంగ్డూ, కుమింగ్ సహా అన్ని పెద్ద నగరాల్లోనూ ఈ తరహా విధానం కొనసాగుతుంది. ఆఫీసుకు వచ్చినవాళ్లు అక్కడ ఖాళీగా ఖూర్చున్నా.. కంప్యూటర్లలో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. డోంగువాన్ నగరంలో ప్రిటెండ్ టు వర్క్ ఆనే ఆఫీసును నెలకొల్పిన యాజమాని మాట్లాడుతూ.. నేను వర్క్ స్టేషన్ అమ్మడం లేదు. పనిలేని వ్యక్తిగా ఉండకపోవడం అనే గౌరవాన్ని అమ్ముతున్నా అని చెప్పాడు. అయితే, తన కంపెనీకి వచ్చే వారిలో 40శాతం మంది యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లు ఉన్నారని, వారు ఫొటోలు తీసుకుని తాము అక్కడ ఇంటర్న్ షిప్ చేస్తున్నట్లు ట్యూటర్లకు ఫొటోలు పంపిస్తున్నారని చెప్పాడు.
న్యూజీలాండ్ లోని విక్టోరియా యూనివర్శిటీ ఆఫ్ వెల్లింగ్టన్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో సీనియర్ లెక్చరర్ గా ఉన్న డాక్టర్ క్రిస్టియన్ యావో మాట్లాడుతూ.. పనిచేస్తున్నట్లు నటించడం ఇప్పుడు సర్వసాధారణం. ఆర్థిక రంగంలో జరుగుతున్న మార్పులు, విద్య, ఉద్యోగాల మధ్య సమతుల్యత లేకపోవడం, తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఆలోచించడానికి, మార్పుల్లో భాగంగా లభించే చిన్న ఉద్యోగాలు చేయడానికి యువతకు ఇలాంటి ప్రదేశాలు అవసరం అని పేర్కొన్నారు.
23ఏళ్ల యువతి గతేడాది యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమెరకు ఇప్పటి వరకు ఫుల్ టైమ్ ఉద్యోగం దొరకలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన ఏడాదిలోపు విద్యార్థులు తప్పనిసరిగా ఉద్యోగంలో చేరాలి. లేదా ఏదైనా సంస్థలో ఇంటర్న్ షిప్ చేస్తున్నట్లు ఆధారం సమర్పించాలని ఆమె చదువుకున్న యూనివర్శిటీలో ఒక నియమం ఉంది. అలా చేయకపోతే యూనివర్శిటీ వారికి డిప్లొమా ఇవ్వదు. దీంతో సదరు యువతి అద్దెకు తీసుకున్న ఆఫీసులో ఫొటోలుదిగి తాను ఇంటర్న్‌షిప్ చేస్తున్నానని, అందుకు ఆ ఫొటోలే ఆధారమని ఆమె వాటిని యూనివర్శిటీకి పంపించారు. మరోవైపు, నిరుద్యోగ రేటును తగ్గించేందుకు చైనా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది.