Landmine Sniffing Rat : ఎలుకా మజాకా.. ల్యాండ్ మైన్స్ కనిపెట్టడంలో మూషికం వరల్డ్ రికార్డ్, ఏకంగా 109 మందుపాతరలను గుర్తించింది..

ఆగస్టు 2021 నుంచి మొదలు.. ఇప్పటివరకు 109 మందుపాతరలు, 15 పేలని ఆయుధాలను కనిపెట్టింది.

Landmine Sniffing Rat : మన ఇళ్లలో ఎలుక కనిపిస్తే చాలు ఆందోళనకు గురవుతాం. ఇంట్లో అది చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. తన పళ్లతో వస్తువులను నాశనం చేస్తుంది, ఆహార పదార్ధాలను తినేస్తుంది. అందుకే, ఎలుక కనిపించిందంటే బెంబేలెత్తిపోతాం. వాటిని ఇంట్లో నుంచి తరిమేసే వరకూ నిద్రపోము. అయితే, ఇది ఎలుక గురించి తెలిసిన వన్ సైడ్ స్టోరీ మాత్రమే.

కాయిన్ కి మరో వైపు ఉన్నట్లే.. మూషికానికీ మరో స్టోరీ కూడా ఉంది. దాని వల్ల నష్టాలే కాదు లాభాలూ ఉన్నాయి. మనిషి కూడా చేయలేని అద్భుతాలు ఎలుకలు చేస్తున్నాయి. ఆ మూషికం టాలెంట్ గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఓ మూషికం యుద్ధకాలం నాటి ల్యాండ్ మైన్స్ (మందుపాతరలు) కనిపెట్టడంలో ఆరితేరింది. ఈ విషయంలో ఆ ఎలుక వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 109 మందుపాతరలను (ల్యాండ్ మైన్స్), 15 వరకు పేలని ఆయుధాలను కనిపెట్టింది. ఎలుక ఏంటి, మందుపాతరలు కనిపెట్టడం ఏంటి.. అని విస్తుపోతున్నారా.. ఆ వివరాల్లోకి వెళితే..

Rat Ronin

అది కాంబోడియా. అక్కడ మందుపాతరలను కనిపెట్టడంలో ఓ ఎలుక వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. వందకుపైగా మందుపాతరలు, ప్రమాదకరమైన యుద్ధ అవశేషాలను కనిపెట్టి రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఆ మూషికానికి పేరు కూడా ఉందండోయ్. ఏంటో తెలుసా.. రోనిన్. అదొక ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్. ఆగస్టు 2021 నుంచి మొదలు.. ఇప్పటివరకు 109 మందుపాతరలు, 15 పేలని ఆయుధాలను కనిపెట్టిందట. జంతువులకు శిక్షణ ఇచ్చే స్వచ్ఛంద సంస్థ అపోపో ఈ విషయాన్ని తెలిపింది.

Also Read : అయ్య బాబోయ్.. 10 అంతస్తుల బిల్డింగ్ సైజులో భారీ గ్రహశకలం.. మనమైతే సేఫ్.. చంద్రుడిని ఢీకొట్టబోతుందా?

కాంబోడియాలో 20 ఏళ్ల అంతర్యుద్ధం 1998లోనే ముగిసింది. అయినప్పటికీ పేలని మందుగుండు సామాగ్రి భారీగా ఉండిపోయింది. నేలలో ఎక్కడ బాంబు ఉందో తెలియని పరిస్థితి. దాంతో స్థానిక ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే హడలిపోయేవారు. ఎక్కడ కాలు పెడితే ఏ బాంబు పేలి ప్రాణాలు పోతాయోనని నిత్యం భయపడుతూ జీవిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్న అక్కడి ప్రజలకు రోనిన్ ఆపద్బాంధవుడిగా నిలిచింది.

గతంలో మాగ్వా ప్రాంతంలో 71 ల్యాండ్ మైన్స్, 38 పేలని ఆయుధాలను గుర్తించి 2020లో ఓ ఎలుక గోల్డ్ మెడల్ పొందింది. ఐదేళ్ల వ్యవధిలో ఆ ఎలుక ఈ ఘనత సాధించింది. ఇప్పుడు రోనిన్ ఆ రికార్డును చెరిపేసిందని అపోపో తెలిపింది.

Rat Ronin Record

జంతువులకు శిక్షణ ఇచ్చే స్వచ్ఛంద సంస్థ అపోపో టాంజానియా కేంద్రంగా పని చేస్తుంది. ఆ సంస్థ దగ్గర 104 ఎలుకలు ఉన్నాయి. యుద్ధ భూమిలో వదిలేసిన మందుపాతరలు, ఇతర ఆయుధాల్లో లభించే రసాయనాలను పసిగట్టేందుకు మూషికాలకు ట్రైనింగ్ ఇస్తారు. మందుపాతరలు కనిపెట్టేందుకు ఎలుకలను వాడటం వెనుక చాలా ముఖ్యమైన కారణమే ఉంది. ఎలుకలు సైజులో చాలా చిన్నవి. అంతేకాదు.. అవి అడుగు పెట్టినా బాంబులు పేలేంత బరువు ఉండవు. అందుకే, ఎలుకల ద్వారా మందుపాతరల కోసం వెతకడం చాలా ఈజీ అయ్యింది.

మందుపాతరలు కనిపెట్టడంలో ఎలుక, మనిషికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి అపోపో కీలక విషయం వెల్లడించింది. టెన్నిస్ కోర్టు సైజులో ఉన్న ప్రాంతాన్ని సైతం ఎలుకలు జస్ట్ అర గంటలో తనిఖీ చేసేయగలవట. అదే ఓ మనిషి మెటల్‌ డిటెక్టర్‌తో అంతే ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి కనీసం 4 రోజులు పట్టొచ్చని అపోపో తెలిపింది.

Also Read : ఇంజనీరింగ్ అద్భుతం.. మరో 100 ఏళ్ల వరకు చెక్కుచెదరని మన బ్రిడ్జి ఇది..

ఎలుకల సామర్థ్యం గురించి అపోపో కీలక విషయాలు తెలిపింది. ఊపిరితిత్తులను ప్రభావితం చేసే క్షయ వ్యాధిని ల్యాబ్ లో మైక్రోస్కోపీ విధానంలో గుర్తించే వేగం కన్నా.. ఎలుకలు ఇంకా వేగంగా గుర్తించగలవని చెప్పింది.

Rat Ronins Record

ఇక అపోపో విషయానికి వస్తే చాలా ఇంట్రస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఇదొక స్వచ్ఛంద సంస్థ. 25 ఏళ్ల క్రితం స్థాపించబడింది. మందుపాతరలు, ఇతర పేలుడు పదార్ధాలను గుర్తించడంలో స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష 69వేల 713 మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలను గుర్తించింది. అందులో 52 వేలు ఒక్క కాంబోడియాలోనే దొరికాయి. యుక్రెయిన్, దక్షిణ సూడాన్, అజర్‌బైజాన్ సహా యుద్ధ ప్రభావిత దేశాలలోనూ ఈ స్వచ్ఛంద సంస్థ పని చేస్తోంది. ఓ నివేదిక ప్రకారం కాంబోడియాలో ఇప్పటికీ భూమిలోపల 40 నుంచి 60 లక్షల మందుపాతరలు, పేలని మందుగుండు సామాగ్రి ఉన్నాయట.

ల్యాండ్ మైన్స్ గుర్తించడంలో రికార్డ్ స్థాయిలో దూసుకుపోతున్న చిట్టెలుక రోనిన్.. మరో రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం గుర్తింపు పనిని చేస్తుందని అపోపో తెలిపింది. “రోనిన్ విజయాలు మేమిస్తున్న శిక్షణకు, అద్భుతమైన సామర్థ్యానికి నిదర్శనం. అది కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు. విలువైన భాగస్వామి, సహోద్యోగి” అని రోనిన్ హ్యాండ్లర్ ఫానీ తెలిపారు.

రోనిన్ క్లిక్కర్ శిక్షణ పొందాడు. దాని ద్వారా పేలుడు పదార్థాలను ఎలా వాసన చూడాలో నేర్చుకుంటుంది. అలాగే నేలపై గోకడం ద్వారా ల్యాండ్‌మైన్‌లను సూచించడానికి కూడా ట్రైనింగ్ ఇవ్వబడింది. రోనిన్, అతడి లాంటి ఎలుకలు రోజుకు దాదాపు 30 నిమిషాలు పని చేస్తాయని APOPO తెలిపింది. ఒక నిర్దిష్ట వయసుకు చేరుకున్నప్పుడు వాటిని పదవీ విరమణ సంఘానికి తరలిస్తారు. APOPO సంరక్షణలో ఉంచుతారు. ల్యాండ్ మైన్స్ ను గుర్తించడంలో మునుపటి రికార్డ్ హోల్డర్ మాగావా 2021లో పదవీ విరమణ చేసి 2022లో మరణించింది.