Chief Mouser Larry: ఆరుగురు ప్రధానుల దగ్గర పని చేసిన పిల్లి.. ఏడో పీఎం కోసం వెయిటింగ్..
కీర్ స్టార్మర్ రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే, సోషల్ మీడియా వేదికగా లారీ(Chief Mouser Larry) 'పారడీ' ఖాతా నుండి వచ్చిన వ్యంగ్య పోస్టులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
- V Santhosh Kumar
- Published on- June 22, 2026 / 06:57 PM IST
Larry, the Chief Mouser who has served under seven British Prime Ministers, has gone viral online.
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా.
- లారీ పిల్లి వ్యంగ్య పోస్టులు.
- ఆరుగురు ప్రధానుల కాలంలో సేవలు.
Chief Mouser Larry: ప్రపంచ దేశాల రాజకీయాల్లో బ్రిటన్ (యూకే) ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇటీవలి కాలంలో అక్కడ జరుగుతున్న వేగవంతమైన రాజకీయ పరిణామాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్గత విభేదాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ మరోసారి వార్తల్లోకెక్కింది. గత పదేళ్లలోనే ఏడో ప్రధానిని ఆహ్వానించేందుకు బ్రిటన్ సిద్ధమవుతున్న తరుణంలో, ప్రధానులందరినీ దగ్గరుండి చూసిన ఒకే ఒక్క శాశ్వత ‘క్యాబినెట్ సభ్యుడి’పై అందరి దృష్టి పడింది. ఆ సభ్యుడే.. డౌనింగ్ స్ట్రీట్ అధికారిక పిల్లి, ‘చీఫ్ మౌజర్’ లారీ(Chief Mouser Larry).
కీర్ స్టార్మర్ రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే, సోషల్ మీడియా వేదికగా లారీ ‘పారడీ’ ఖాతా నుండి వచ్చిన వ్యంగ్య పోస్టులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. “నా ప్రధాన సేవకుడైన కీర్ స్టార్మర్ రాజీనామాను నేను ఆమోదించాను. అలాగే తదుపరి రేసులో ఉన్న ఆండీ బర్న్‌హామ్‌ను నాకు రోజుకు ఎన్నిసార్లు ఆహారం పెడతారో వివరించాల్సిందిగా ఆహ్వానించాను” అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. మరో పోస్టులో, మధ్యలోనే పదవులు కోల్పోయిన ఐదుగురు మాజీ ప్రధానులు, ఎన్నికల్లో ఓడిపోయిన రిషి సునక్‌ల ఫోటోను షేర్ చేస్తూ, “మరొకరు లైన్ నుంచి తప్పుకున్నారు” అంటూ లారీ శైలిలో సెటైర్లు వేశారు. దీంతో ఆ పోస్టులు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక, గోధుమ, తెలుపు రంగుల కలయికతో ఉండే ఈ పిల్లిని 2011లో ‘బాటర్సీ డాగ్స్ అండ్ క్యాట్స్ హోమ్’ నుండి రక్షించి లండన్‌లోని ప్రధానమంత్రి అధికారిక నివాసానికి తీసుకువచ్చారు. అప్పటి నుండి ఇప్పటివరకు డేవిడ్ కామెరాన్, థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునక్, కీర్ స్టార్మర్‌లతో కలిపి మొత్తం ఆరుగురు బ్రిటిష్ ప్రధాన మంత్రుల కాలంలో ఇది తన సేవలను అందించింది. ప్రస్తుతం బ్రిటన్ రాజకీయాల్లో ఒక శాశ్వత చిహ్నంగా మారిన లారీ.. ప్రధాని నివాసం వెలుపల ప్రపంచ దేశాల నాయకులు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులతో కలిసి ఫోటోలకు పోజులిస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది ఈ పిల్లి.
