Representative Image (Image Credit To Original Source)
US Israel Iran War: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడిని 10 వామపక్ష పార్టీలు ఖండించాయి. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఖమేనీ నివాసంపై దాడి సామ్రాజ్యవాద దురహంకారమని విమర్శించాయి. పాఠశాలలపై బాంబులు వేసి పిల్లలను చంపడం అమానుషమని మండిపడ్డాయి. ఇది ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడి అని వామపక్షాలు ఆరోపించాయి. ఐక్యరాజ్యసమితి నిబంధనల ఉల్లంఘన అని వ్యాఖ్యానించాయి. దాడులను ఖండించాలని ప్రజలకు పిలుపునిచ్చాయి వామపక్షాలు. గల్ఫ్ సహజ వనరుల కోసమే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి చేశాయని ఆరోపించాయి.
అమెరికా సామ్రాజ్యవాద విధానాలే ఉగ్రవాదానికి కారణమని విమర్శించాయి. ఇరాక్‌పై 2003 దాడి తరహాలోనే ఇరాన్‌పై చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులను కూడా వామపక్షాలు ఖండించాయి. క్యూబా, వెనిజులాపై అమెరికా చర్యలను తప్పుపట్టాయి. ఇరాన్‌పై దాడిని ఖండించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇజ్రాయెల్‌కు మద్దతివ్వడం తప్పని ప్రధాని మోదీపై మండిపడ్డాయి. ఇరాన్ ప్రజలకు ప్రపంచ ప్రజలు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు విజయవాడలో వామపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి.