Peru Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన పర్యాటక విమానం.. 13 మంది మృతి
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతమైన పెరూ(Peru Plane Crash) దేశంలో ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
Thirteen people died in a tourist plane crash in peru
- పెరూలో ఘోర విమాన ప్రమాదం
- 13 మంది పర్యాటకులు దుర్మరణం
- సాంకేతిక లోపంపై సమగ్ర దర్యాప్తు
Peru Plane Crash: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతమైన పెరూ దేశంలో ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ పురాతత్వ వింత అయిన ‘నాజ్కా లైన్స్’ను ఆకాశ మార్గం ద్వారా వీక్షించేందుకు పర్యాటకులతో బయలుదేరిన ఒక చిన్న విమానం హఠాత్తుగా కుప్పకూలిపోయింది. నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం, స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 13 మంది పర్యాటకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఎంతో ఉత్సాహంగా పురాతన కట్టడాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
NEET-UG 2026: నీట్-యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తెగిపోయిన సంబంధాలు:
పెరూ(Peru Plane Crash)కు చెందిన ‘ఎయరోడియానా’ సంస్థకు చెందిన సెస్నా గ్రాండ్ కారవాన్ విమానం ఇకా నగరంలోని పిస్కో విమానాశ్రయం నుంచి పర్యాటకులతో బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత సమీపంలోని ఒక మైదాన ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రతకు విమానం శకలాలు చెల్లాచెదురుగా పడిపోయి, పొగలు ఎగసిపడ్డాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రమాదానికి వాతావరణమే కారణమా? అధికారుల దర్యాప్తు:
నాజ్కా లైన్స్ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో శతాబ్దాల క్రితం ఎడారిలో గీసిన భారీ జియోగ్లిఫ్‌లు కేవలం విమానాల నుంచే స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ప్రమాదానికి ఒక రోజు ముందు గంటకు 40 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన ఈదురు గాలుల వల్ల దుమ్ము ఎగసిపడి దృశ్యమానత (విజిబిలిటీ) దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘోర ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమా లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులే ముంచెత్తాయా అనే కోణంలో పెరూ విమానయాన అధికారులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
