Lockdown
Lockdown : లాక్‌డౌన్.. ఈ పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో వణుకు వస్తుంది. కరోనా వైరస్ కారణంగా భారతదేశంతోపాటు పలు దేశాల్లో నెలల పాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, మళ్లీ అదే పరిస్థితి పలు దేశాల్లో రాబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పలు దేశాల్లో భారీగా ఇన్‌ఫ్లుఎంజా (ఫ్లూ) కేసులు నమోదవుతున్నాయి.
జపాన్ దేశంలో ఇటీవల భారీ సంఖ్యలో ఇన్‌ఫ్లుఎంజా కేసులు పెరుగుతూ వచ్చాయి. దీంతో అధికారులు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. వైరస్ శరవేగంగా వ్యాపిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. జపాన్‌లోని ఆస్పత్రిలన్నీ రోగులతో నిండిపోయాయి. పాఠశాలలు, మార్కెట్లు మూసివేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ ఫ్లూ వ్యాప్తి జపాన్ దేశంలో కోవిడ్ -19 తరహా పరిస్థితులను తలపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నవారు ఫ్లూ బారిన పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది.
Also Read: మరో దేశంలో భగ్గుమన్న జెన్-జీ.. దేశం విడిచి పారిపోయిన ప్రెసిడెంట్.. అట్టుడుకిపోతున్న నగరాలు..
మలేషియా దేశంలోనూ ఇన్‌ఫ్లుఎంజా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. దీంతో మలేషియా అధికారులు పాఠశాలలను మూసివేయాలని, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఒక వారం పాటు ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. విద్యామంత్రిత్వ శాఖ అధికారులు ఈ మేరకు ప్రకటన చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తన నివేదికలో పేర్కొంది.
ఇన్‌ఫ్లుఎంజా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో జాతీయ సిజిల్ పెలాజరన్ మలేషియా (SPM) పరీక్షల సమయంకు కొన్ని వారాల ముందు పాఠశాలలు మూసివేయాలని ఆదేశించారు. జిల్లా ఆరోగ్య అధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యామంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అజామ్ అహ్మద్ తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక పాఠశాలలను మూసివేయాలని ఆదేశించడం జరిగిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేయడం వల్ల దాదాపు 6వేల మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యారని చెప్పారు.
ఇన్‌ఫ్లుఎంజా మహమ్మారి సోకిన వారు ఐదు నుండి ఏడు రోజులు స్వీయ నిర్భందాన్ని పాటించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మలేషియా ఎదుర్కొన్న అత్యంత విస్తృతమైన వైరల్ వ్యాప్తిలలో ప్రస్తుత ఇన్‌ఫ్లుఎంజా వేవ్ ఒకటని అక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో మలేషియా అంతటా పాఠశాలలను కొద్దిరోజులు మూసివేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని చర్యలు చేపట్టారు. పరిస్థితి విషమించితే మిగిలిన రంగాలకు కూడా హాలిడే ప్రకటించేందుకు మలేషియా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.