wildfire
లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. శాంటా మోనికా, మాలిబు మధ్య పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోని దాదాపు 1,262 ఎకరాలు (510 హెక్టార్లు) కార్చిచ్చుకు మాడి మసైపోయింది. పొడి వాతావరణం వల్ల వచ్చే శక్తిమంతమైన గాలుల నుంచి మరింత ముప్పు ఉందని అధికారులు తెలిపారు.
దీంతో కార్చిచ్చు ప్రభావం ఉండే ప్రాంతాల నుంచి 30,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్వతాల నుంచి తీరం వరకు అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీగా పొగ కనపడింది.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ లాస్ ఏంజిల్స్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన కార్చిచ్చని తెలిపారు. తీవ్ర గాలుల వల్ల కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తుందని అన్నారు.
లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 30,000 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. దాదాపు 10,000 ఇళ్లు కార్చిచ్చు ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు కార్చిచ్చు వల్ల ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మాలిబులోని హిల్‌టాప్ మ్యూజియం గెట్టి విల్లా వరకు మంటలు ప్రమాదకరంగా వ్యాపించాయని వివరించారు.