Fire At Fireworks Factory : ఘోర అగ్నిప్రమాదం.. బాణసంచా కర్మాగారంలో 14మంది మృతి..
Fire At Fireworks Factory : బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 14మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
- Harish Thanniru
- Published on- September 29, 2026 / 08:48 AM IST
Fire At Fireworks Factory
Fire At Fireworks Factory : బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 14మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన రష్యాలోని యారోస్లావ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సోమవారం కుబ్రిన్స్క్ గ్రామంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. మంటలకు ఒక్కసారిగా పటాసులు పేలుళ్లు సంభవించడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
మాస్కోకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ కర్మాగారం ఉంది. మంటలు చెలరేగిని వెంటనే దట్టమైన పొగలు వ్యాపించాయి. కర్మాగారంలోని రెండు భవనాలకు మంటలు వ్యాపించడంతో ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి పెద్ద సంఖ్యలో అత్యవసర సిబ్బందిని రంగంలోకి దించారు. కొందరి శరీర భాగాలు గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదని స్థానిక అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోల్లో బాణసంచా కర్మాగారం నుంచి భారీగా మంటలు, నిప్పురవ్వలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. ప్రమాదంలో 14మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే, తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
