ఓయ్.. ఇరాన్ మాటలు జాగ్రత్త: ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్‌ను మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇరాన్‌ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా ఖమైనీని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించారు. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ‘ఇరాన్‌ అధికారుల్లో సుప్రీంగా పిలిచే ఖమైనీ.. అమెరికా, ఐరోపా పట్ల కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ప్రజలు అనేక బాధలు అనుభవిస్తున్నారు. కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి’ అని ట్విటర్‌ ద్వారా ఖమైనీని హెచ్చరించారు. 

అంతేకాకుండా ‘ఉగ్రవాదాన్ని వీడి.. ఇరాన్‌ను తిరిగి గొప్ప దేశంగా మార్చాలి’ అని దేశ నేతలకు హితవు పలికారు. ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నట్లుగా వారికి మెరుగైన భవిష్యత్తును, గౌరవాన్ని అందించే ప్రభుత్వాన్ని సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ పట్ల ఆయతుల్లా ఖమైనీ ట్విటర్‌ ఖాతా ద్వారా పరుష పదజాలం వాడినట్లు తెలుస్తోందన్నారు. ఈ క్రమంలోనే ట్విటర్‌ ఖాతాలోని ఖమైనీ పేరిట ఉన్న వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ ట్రంప్‌ విరుచుకుపడ్డారు. 

‘అనాగరికపు అమెరికా.. ఇరాన్‌ ప్రజలకు అండగా ఉంటున్నామంటూ అబద్ధాలు చెబుతోంది. ఒకవేళ ఇరాన్ ప్రజలతోనే ఉన్నా.. వారి గుండెల్లో విషపు కత్తులతో పొడిచి చంపడానికే చూస్తుంది. అమెరికా ఇప్పటికే ఆ ప్రయత్నంలో విఫలమైంది. ఇక ముందు కూడా ఓటమి పాలవుతూనే ఉంటారు’ అని ఖమైనీ ట్విటర్‌లో రాసుకొచ్చారు. 

ఖమైనీ ఆ తర్వతా అమెరికాతో ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందాన్ని కుదించడం పట్ల అయిష్టత వ్యక్తం చేశారు. 2015లో కుదిరిన ఒప్పందాన్ని యూరోపా దేశాలతో చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో అగ్రిమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్రంప్ కొద్ది నెలల క్రితమే ప్రకటించారు.