కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 40మంది భారతీయులు మృతి, ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం

కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదం అత్యంత బాధాకరం. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.

Kuwait Building Fire : కువైల్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం భారతీయుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ అగ్ని ప్రమాదంలో 49 మంది చనిపోయారు. వారిలో 40 మంది భారతీయులు ఉండటం అత్యంత విషాదకరం. అగ్నిప్రమాదంలో 40మంది భారతీయులు మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కువైట్ లోని భారత దౌత్య కార్యాలయం అగ్నిప్రమాద ఘటన, అనంతరం పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోందిన ప్రధాని మోదీ వెల్లడించారు. కాగా, కువైట్ అగ్రిప్రమాద దుర్ఘటనపై ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోందని అధికారులు తెలిపారు.

”కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదం అత్యంత బాధాకరం. నా ఆలోచనలు తమ సన్నిహితులను, ప్రియమైన వారిని కోల్పోయిన వారందరిపై ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. బాధితులకు సాయం చేయడానికి అక్కడి అధికారులతో కలిసి పని చేస్తోంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

మంగాఫ్ నగరంలోని ఓ కంపెనీకి చెందిన అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగ ఆ బిల్డింగ్ కు కమ్మేసింది. దీంతో కార్మికులు ఆ భవనంలోనే చిక్కుకుపోయారు. 6 అంతస్తుల ఆ భవనంలో 160 మంది వరకు కార్మికులు నివాసం ఉంటున్నారు. ముందుగా ఓ వంట గదిలో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో మొత్తం పాకిపోయాయి. తప్పించుకునే వీలు లేకపోవడంతో కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడక పలువురు చనిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం నుంచి కిందకు దూకేశారు. ఈ క్రమంలో వారు తీవ్ర గాయాలతో చనిపోయారు.

కువైట్ లోని భారత దౌత్య కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. ఎటువంటి సాయం కావాలన్నా, సమాచారం కావాలన్నా కోసం +965-65505246 నెంబర్ కు ఫోన్ చేయాలంది.

Also Read : కథువాలో వరుస దాడులు.. గ్రామస్థుల ఇంటింటికీ వెళ్లి నీళ్లు అడుగుతున్న ఉగ్రవాదులు!

ట్రెండింగ్ వార్తలు