Barbara Jarabica Mehul Choksi
Mehul Choksi Cheated : పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ గుట్టును అతని గర్ల్‌ఫ్రెండ్ బార్బరా జబరికా రట్టు చేశారు. గతేడాది తాను ఆంటిగ్వా వెళ్లినప్పుడు చోక్సీ తనకు పరిచయం అయ్యాడని, తనను తాను రాజ్‌గా పరిచయం చేసుకున్నాడని పేర్కొన్నారు. మొదట్లో స్నేహితుడిగా ఉండేవాడని ఆ తర్వాత తనని మోసం చేశాడని, చోక్సీ తనకు తనకు డైమండ్ రింగులు, బ్రేస్‌లెట్లు బహుమతిగా ఇస్తే తాను మురిసిపోయానని వెల్లడించారు. కానీ అవన్నీ నకిలీవని తర్వాత తెలిసిందని బార్బరా తెలిపారు
చోక్సీ కిడ్నాప్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని బార్బరా జబరికా స్పష్టం చేశారు. ఈ కేసులో చోక్సీ లాయర్లు తనను, తన కుటుంబ సభ్యులను ఇరికించారని ఈ ఉదంతంతో తాను, కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మెహుల్ చోక్సీ తన గర్ల్‌ఫ్రెండ్‌పైనే ఆరోపణలు చేశారు. నమ్మిన అమ్మాయే తనని ట్రాప్ చేసి కిడ్నాప్‌కు సహకరించిందని ఆరోపించారు. ఇంటర్వ్యూ పేరుతో యాంటిగాలో తనని కిడ్నాప్ చేసి డొమినికాకు తీసుకువచ్చారని చోక్సీ తెలిపారు. ఆ తర్వాత నన్ను డొమినికా కోస్టుగార్డులకు అప్పగించారని…. ఇంటర్‌పోల్ నోటీసు కారణంగా పోలీసులు తనని అరెస్టు చేశారని చోక్సీ తెలిపారు. బార్బరా ఇంటికి వెళ్లినపుడు తనని కిడ్నాప్ చేశారని చెప్పుకొచ్చారు. తనపై దాడి జరుగుతుంటే బార్బరా కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. తనని కిడ్నాప్ చేసిన వారిలో భారతీయులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు చోక్సీ.
మరోవైపు చోక్సీని భారతీయ పౌరుడిగా తాము గౌరవిస్తామని డొమినికా ప్రధాని రూజ్‌వెల్ట్ స్కెరిట్ పేర్కొన్నారు. ప్రస్తుతం చోక్సీ కేసు కోర్టులో ఉందన్నారు. కోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. యాంటిగాలో పౌరసత్వం కోసం మెహుల్ చోక్సీ దరఖాస్తు చేసుకున్న సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆదేశ సమాచార శాఖ మంత్రి మేల్‌ఫోర్ట్ తెలిపారు. క్రిమినల్ కేసులు లేవని పత్రాలు సమర్పించారని చెప్పారు. చోక్సీ దరఖాస్తు సమయంలో క్రిమినల్ కేసులు ఉన్నట్టు కూడా దర్యాప్తు ఏజెన్సీల విచారణలో లేదన్నారు. అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కేసుల అంశం వెలుగులోకి రావడంతో పౌరసత్వం కోసం తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో యాంటిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక ఛోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13,500 కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయారు. 2018 నుంచి చోక్సీ యాంటీగాలో ఉంటున్నారు. ప్రస్తుతం డొమినికాలో ఉన్న చోక్సీని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Read More : Mobile CNG Refuelling Units : భారత్ ఫస్ట్ మొబైల్ CNG రిఫీల్లింగ్ యూనిట్లు.. ఇక ఇంటివద్దనే నింపుకోవచ్చు!