Taliban: తాలిబన్ల కొత్త ఫత్వా.. మళ్లీ ఆడవాళ్లే టార్గెట్

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ అధికారం చేపట్టి రెండు వారాలు అయ్యింది.

Girls

Islam Rules: అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ అధికారం చేపట్టి రెండు వారాలు అయ్యింది. ఇప్పుడు తాలిబాన్లు తమ అసలు రంగులను చూపించడం మొదలుపెట్టారు. అఫ్ఘానిస్తాన్‌లో కో-ఎడ్యుకేషన్‌పై తాలిబన్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అమ్మాయిలకు టీచింగ్ చేసేందుకు పురుషులకు అనుమతి లేదని తాలిబన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ప్రకటించారు. దేశంలో విద్యా విధానం కూడా షరియా చట్టాలకు అనుగుణంగానే ఉంటాయని హక్కానీ వెల్లడించారు.

దేశంలో విద్యావ్యవస్థను పటిష్టం చేస్తామని వెల్లడించిన తాలిబాన్లు.. హక్కానీని తాత్కాలిక విద్యాశాఖా మంత్రిగా నియమించారు. ఈ క్రమంలోనే విద్యా విధానంపై ప్రకటన చేశారు. తాలిబాన్ల నిర్ణయంతో అమ్మాయిలు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా తరగతులు నిర్వహించేందుకు తగిన మానవ వనరులు అందుబాటులో లేనందున ఈ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న విద్యా విధానాన్ని విమర్శించిన హక్కానీ, ఇస్లామిక్ సూత్రాలను అమలు చేయడంలో దేశ విద్యావిధానం ఘోరంగా విఫలమైందన్నారు. ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క దానిని తీసివేస్తామని ప్రకటించారు. అఫ్ఘానిస్తాన్ ప్రజలు తమ మత మరియు జాతీయ విలువలు మరియు స్వేచ్ఛను కాపాడటానికి బలంగా ప్రయత్నిస్తామని అన్నారు. ఇందులో యువత పెద్ద బాధ్యతను పోషించాలని కోరారు. దేశాన్ని నిర్మించడంలో తమ వంతు పాత్ర పోషించడం దేశంలోని ఉపాధ్యాయుల బాధ్యతగా చెప్పారు.

ఇస్లామిక్ విలువలను అనుసరించి బాలురు మరియు బాలికల కోసం త్వరలో పాఠశాలలు తెరవబడతాయని హక్కానీ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి దేశ రాజకీయ వ్యవస్థ పని చేస్తుందని హక్కానీ హామీ ఇచ్చారు. అయితే, మగ ఉపాధ్యాయులు బాలికలకు బోధించలేరని కూడా హక్కానీ చెప్పారు. దేశంలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు కలిసి చదువుకునే పరిస్థితి ఇక ఉండదని, ఇస్లామిక్ చట్టం ప్రకారం, వారు విడివిడిగా చదువుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.