Meta: మెటా సంస్థ కీలక ప్రకటన.. భార‌త్‌లోనూ ‘ప్రాజెక్ట్ వాట‌ర్‌వ‌ర్త్’.. అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?

ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ వాటర్ వర్త్’కు సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ శ్రీకారం చుట్టబోతుంది.

Meta Project Waterworth

Project Waterworth: ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ వాటర్ వర్త్’కు సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ శ్రీకారం చుట్టబోతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయంగా డిజిటల్ కెనెక్టివిటీని పెంచేందుకు మెటా నడుంబిగించింది. అయితే, ఈ ప్రాజెక్టులో భారతదేశం కూడా చేరనుంది. అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ను కలిపే సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టును ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మెటా సంస్థ చెప్పింది. ఈ ప్రాజెక్టు కోసం బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

 

మెటా సంస్థ  చేపడుతున్న సాహసోపేత ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ వాటర్ వర్త్’. 50వేల కిలో మీటర్లకుపైగా విస్తరించిఉండే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యధిక సామర్థ్యం కలిగిన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థగా అవతరించనుంది. ఇది భూమి చుట్టుకొలత (40,075కిలో మీటర్లు) కంటే ఎక్కువ. ఈ కేబుల్ ప్రాజెక్టు ప్రపంచంలోని ఐదు ప్రధాన ఖండాలను కలుపుతుంది. మెటా అప్లికేషన్లు, సర్వీసులను బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ తెలిపింది.

 

ఇంటర్నెట్ కార్యకలాపాలకు సముద్రగర్బం కేబుళ్లు కీలకం. దేశాలు పరస్పరం ఈ కేబుళ్లతోనే అనుసంధానమవుతాయి. స్థానిక టెలికాం ఆపరేటర్లు ఈ కేబుళ్లకు అనుసంధానం కావడం ద్వారా తమ వినియోగదారులకు ఇంటర్నెట్ ను అందిస్తుంటాయి. అయితే, మెటా సంస్థ సముద్రగర్భంలో ఏర్పాటు చేయబోయే కేబుల్ కు నౌకల లంగర్లు, ఇతర ప్రమాదాల వల్ల ఇబ్బంది తలెత్తకుండా అధునాతన సాంకేతికతను వినియోగించి 7వేల మీటర్ల వరకు లోతులో బలంగా వేస్తున్నారు. ఇది అత్యంత భారీ ప్రాజెక్టు. బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

 

మెటా సంస్థకు అతిపెద్ద మార్కెట్లలో భారతదేశం ఒకటి. భారతదేశంలో డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా ఈ పెట్టుబడి ఆర్థిక వృద్ధి, స్థిర మౌలిక సదుపాయాలు, అందరికీ డిజిటల్ సేవలు అందాలన్న మెటా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని మెటా ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పనులు ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయని, వచ్చే ఐదేళ్లలో ఇది పూర్తవుతుందని మెటా అంచనా వేస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భారత్ ప్రపంచ డిజిటల్ హబ్ గా అవతరిస్తుంది.