Nepal Flood : నేపాల్‌లో మృత్యువును జయించిన ఆరేళ్ల చిన్నారి.. మూడ్రోజుల తర్వాత శిథిలాల నుంచి బయటకు! వీడియో వైరల్..
Nepal Floods 6year Old Girl : నేపాల్ లో జలప్రళయం కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, మూడు రోజుల తరువాత శిథిలాల కింద నుండి ఆరేళ్ల బాలిక సురక్షితంగా బయటకు వచ్చింది.
- Harish Thanniru
- Published on- August 30, 2026 / 12:16 PM IST
Nepal Floods 6year Old Girl
Nepal Flood : నేపాల్ లో జలప్రళయం కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరద ఉధృతి కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్, టిబెట్‌లలో విపత్తు ఘటనలో మృతుల సంఖ్య 700 దాటింది.. 3వేల మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో 540 మంది విదేశీయులు ఉన్నారు. అయితే, ఇలాంటి భయానక పరిస్థితుల్లో అద్భత ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారి మృత్యువును జయించి ప్రాణాలతో బయటపడింది.
రుసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో సాయుధ పోలీసు బలగాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో వారికి చిన్నారి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ ప్రాంతంలో వెంటనే మట్టి, శిథిలాలను తొలగించి చూడగా.. ఆరేళ్ల చిన్నారి కనిపించింది. వెంటనే సహాయక సిబ్బంది జాగ్రత్తగా ఆమెను బయటకు తీశారు. అయితే, చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం కాఠ్‌మాండూ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రయాణం ఆలస్యమైంది. చివరకు వాతావరణం అనుకూలించడంతో శనివారం మధ్యాహ్నం సమయంలో బాలికను హెలికాప్టర్ ద్వారా కాఠ్మాండూలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు.
రక్షించిన బాలిక పేరు మనీషా మగర్ అని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల కోసం అధికారులు గాలిస్తున్నారు. అయితే, బాలికను సజీవంగా రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఏపీఎఫ్ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు.. శిథిలాల కింద చిక్కుకుపోయిన తమవారు సజీవంగా ఉండొచ్చనే ఆశతో సహాయక సిబ్బందితో పాటు ప్రజలు కూడా మట్టిదిబ్బలు, శిథిలాలను తొలగించి వెతుకుతున్నారు. వరదల కారణంగా జరిగిన నష్టం, పునర్నిర్మాణానికి బిలియన్ల డాలర్లు ఖర్చయ్యే అవకాశం ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు.
