Nepal Floods: నేపాల్‌ని ముంచెత్తిన రాక్షస వరదలు.. 160 మంది బలి, 750 మంది గల్లంతు.. సరిహద్దుల్లో భయానక దృశ్యాలు
నేపాల్ రసువా ప్రాంతంలోని భోటేకోషి నదికి ఒక్కసారిగా వచ్చిన వినాశకరమైన హఠాత్ వరదలు (Nepal Floods) తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
- V Santhosh Kumar
- Published on- August 27, 2026 / 11:22 AM IST
Nepal Floods bhote koshi river overflows over 160 dead and hundreds missing
- నేపాల్‌లో వినాశకర హఠాత్ వరదలు
- వందలాది మంది గల్లంతు మరణాలు
- భారత్ నుంచి అత్యవసర సాయం
Nepal Floods: ప్రకృతి విపత్తుల ధాటికి పొరుగు దేశమైన నేపాల్ కుదేలైంది. రసువా ప్రాంతంలోని భోటేకోషి నదికి ఒక్కసారిగా వచ్చిన వినాశకరమైన హఠాత్ వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. హిమపాతం, వర్షాల తీవ్రతతో చెలరేగిన ఈ భయానక వరదలు నేపాల్ సరిహద్దుల్లో ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. గ్రామాలు నిమిషాల వ్యవధిలోనే జలమయమవ్వడంతో స్థానిక ప్రజలు దారి లేక ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తీవ్ర ప్రాణ నష్టం, మౌలిక వసతుల ధ్వంసం:
ఈ విషాదకర ఘటనలో ఇప్పటివరకు సుమారు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 750 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రవాహ(Nepal Floods) ఉధృతికి రహదారులు, 35 ప్రధాన వంతెనలు, 45 సస్పెన్షన్ బ్రిడ్జిలు పూర్తిగా కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించి అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతినగా, నేపాల్ సైన్యం 250 మందికి పైగా బాధితులను రక్షించింది. గల్లంతైన వారిలో 139 మంది భారతీయ పౌరులు ఉన్నట్లు సమాచారం.
విపత్తుకు కారణం సీస్మిక్ సిగ్నల్స్, మంచు కొండలు:
USGS విశ్లేషణ ప్రకారం నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద భారీ కొండచరియలు విరిగిపడటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. ఈ కొండచరియలు పడిన తీవ్రత 5.2 రిక్టర్ స్కేలు భూకంపంతో సమానమైన సీస్మిక్ సిగ్నల్స్‌ను నమోదు చేసింది. ఓ భారీ గ్లేషియర్ విరిగిపడి, దాంతో పాటు మంచు, రాళ్లు, బురద నీరు ఒక్కసారిగా ‘ల్హెండే ఖోలా’ నదిలోకి ప్రవహించడంతో భోటేకోషి ఉప్పొంగి ఈ తీవ్ర వినాశనానికి దారితీసింది.
భారత్ తీవ్ర అప్రమత్తత, అత్యవసర సాయం:
ఈ పరిణామాలతో భారత ప్రభుత్వం, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర అప్రమత్తమయ్యాయి. గండక్, కోసి నదుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ మహారాజ్‌గంజ్, ఖుషీనగర్ సహా పలు జిల్లాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ ప్రధాని బాలేన్ షాతో మాట్లాడి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందిస్తూ భారత్ పంపిన HADR బృందాలు, అత్యవసర వైద్య సాయం ఇప్పటికే ఖాట్మండు చేరుకున్నాయని తెలిపారు.
