నేపాల్‌లో రాచరికం కోసం ఎందుకు పోరాడుతున్నారు? మళ్లీ రాజుల కాలాన్ని ఎందుకు కోరుకుంటున్నారు?

చాలామంది రాచరికవాదులు మాజీ రాజు బీరేంద్ర విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.

గతంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు గ్రూపులు ఆందోళనలు చేయడాన్ని చూశాం. ఏ దేశ అధ్యక్షుడైనా, ప్రధాని అయినా, రాష్ట్రాల్లో సీఎం అయినా తప్పుడు విధానాలు అమలు చేస్తుంటే “ఇది రాచరికమా? ప్రజాస్వామ్యమా?” అంటూ విమర్శలు వస్తుంటాయి.

రాచరికం ఉంటే ప్రజల హక్కులకు విఘాతం ఏర్పడుతుందని, ప్రజలపై అధిక పన్నుల భారం పడుతుందని అన్ని దేశాల ప్రజలు భావిస్తారు. అయితే, నేపాల్‌ ప్రజలు మాత్రం రాచరికం కావాలంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.

రాచరికం ఎందుకు?
నేపాల్‌లో రాజకీయ అస్థిరత కొనసాగుతోందని నిరసనకారులు అంటున్నారు. స్థిరమైన పాలన కోసం తమకు రాచరికం కావాలంటూ నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. అది కూడా శాంతియుతంగా కాదు. రాచరికవాదులు కాఠ్మాండూలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. కార్లను, దుకాణాలను తగలబెట్టారు.

Also Read: పీ-4 అంటే ఏంటి? ఉపయోగాలేంటి? దీని నుంచి మీకు ఏ ప్రయోజనాలు అందుతాయి?

దుకాణాల్లోకి చొరబడి దోచుకు వెళ్తున్నారు. దీంతో వారితో పోలీసులను జరిగిన ఘర్షణలో మధ్యలో ఉన్న ఓ జర్నలిస్టు సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు, చాలామందికి గాయాలయ్యాయి. వారిలో 53 మంది పోలీసులతో పాటు 24 మంది సాయుధ బలగాలు కూడా ఉన్నారు. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేతృత్వంలో ఈ నిరసన ప్రదర్శనను నిర్వహించారు.

వారికి నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షా మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాచరికవాదుల తీరును ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. వారు పాల్పడ్డ విధ్వంసంపై విచారణ జరపాలని ఆ దేశ ప్రధానమంత్రి నివాసంలో జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

హింస జరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని ఎత్తివేసింది. నేపాల్‌లో రాచరిక పునరుద్ధరణకు యునైటెడ్ పీపుల్స్ మూమెంట్ అనే కమిటీ కూడా మద్దతు ఇస్తోంది. భృకుటిమండప్‌ ప్రాంతంలో సుమారు 35,000 మంది నిరసనలో పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో టింకునేలో భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు.

కాగా, ఈ నెల 6న జ్ఞానేంద్ర పోఖరాలో చాలామంది రాచరికవాదులు మాజీ రాజు బీరేంద్ర విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఆ కాలానికి చెందిన జాతీయ గీతాన్ని పాడారు. ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడిన అనంతరం జ్ఞానేంద్ర షా బహిరంగంగా ఎక్కువగా కనపడడం లేదు. ఇటీవల మాత్రం బాగా కనపడుతున్నారు.