Nepal Floods : నేపాల్ విపత్తు.. వెయ్యి దాటిన మృతులు.. 4వేల మందికిపైగా గల్లంతు!
Nepal Floods : నేపాల్, చైనాలోని టిబెట్ ప్రాంతాలను కుదిపేసిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో మృతుల సంఖ్య వెయ్యి దాటింది.
- Harish Thanniru
- Published on- September 1, 2026 / 10:59 PM IST
Nepal Floods
Nepal Floods : నేపాల్, చైనాలోని టిబెట్ ప్రాంతాలను కుదిపేసిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. మరోవైపు వేలాది మంది ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోవడంతో సహాయక, రెస్క్యూ బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read : Bihar : నేపాల్ వరదల ఎఫెక్ట్.. బిహార్‌లో హైఅలర్ట్.. వరద నీటిలో దొరికిన చేపలు తినొద్దని హెచ్చరిక.. ఎందుకంటే?
నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల సంఖ్య వెయ్యి దాటగా.. 3,916 మంది గల్లంతైనట్లు తెలిపింది. వీరిలో 583 మంది విదేశీయులు ఉన్నారు. టిబెట్‌లో 16 మంది మరణించారని, మరో 546 మంది ఆచూకీ తెలియడం లేదని చైనా అధికారులు వెల్లడించారు. దీంతో రెండు ప్రాంతాల్లో కలిపి గల్లంతైన వారి సంఖ్య 4,400 దాటింది.
మరోవైపు.. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో లభించిన మృతదేహాలను దేశవ్యాప్తంగా 21 ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే, రోజురోజుకు మృతదేహాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో వాటిని భద్రపరిచేందుకు ఏర్పాట్లు లేక ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు మృతదేహాలను ఖననం చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 700 మృతదేహాల నమూనాలను భద్రపర్చిన అనంతరం వాటిని సామూహికంగా ఖననం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వెలికితీసిన మృతదేహాల్లో 60 మాత్రమే సంబంధిత కుటుంబాలకు అందజేశారు.
మరోవైపు.. వరదల కారణంగా నేపాల్‌లోని పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాజెక్టుల టన్నెళ్లలో వందలాది మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భారీ బండరాళ్లు, బురద, మట్టి పేరుకుపోవడంతో సహాయక బృందాలు లోపలికి వెళ్లడం అత్యంత కష్టంగా మారింది.
ఇప్పటివరకు నేపాల్‌లో 11,814 మందికి పైగా ప్రజలను రక్షించినట్లు అధికారులు తెలిపారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలకు రహదారి మార్గాలను పునరుద్ధరించే పనులు కూడా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు.
