Nestle CEO Fired: ఆఫీస్ రొమాన్స్‌లతో ఊడిపోతున్న సీఈఓల పదవులు.. కార్పొరేట్ ప్రపంచంలో సరికొత్త చర్చ!

కింది స్థాయి ఉద్యోగినితో ఉన్న సంబంధాన్ని దాచినందుకు నెస్లే సీఈఓ (Nestle CEO Fired)లారెంట్ ఫ్రీక్స్‌పై వేటు పడటంతో కార్పొరేట్ సంస్థల్లో తీవ్ర చర్చ మొదలైంది.

Nestle ceo laurent freixe fired oven undisclosed workplace relationships

Nestle CEO Fired: కార్పొరేట్ దిగ్గజ సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న సీఈఓలు, ఎగ్జిక్యూటివ్‌లు కార్యాలయ ప్రేమ వ్యవహారాల (Office Romances) కారణంగా తమ పదవులను కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాజాగా ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే (Nestle CEO Fired) సీఈఓ లారెంట్ ఫ్రీక్స్ (Laurent Freixe) తన కింది స్థాయి ఉద్యోగినితో ఉన్న సంబంధాన్ని కంపెనీకి వెల్లడించకుండా నియమావళిని ఉల్లంఘించినందుకు పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతర్గత విచారణలో ఈ విషయం బయటపడటంతో సంస్థ నైతిక విలువలకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెస్లే ఛైర్మన్ పాల్ బుల్కే స్పష్టం చేసి, ఆయన స్థానంలో ఫిలిప్ నవ్రాటిల్‌ను నియమించారు.

Gold Silver Prices Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే!

గతంలోనూ పలువురు దిగ్గజ కంపెనీల అధిపతులపై వేటు:

ఆఫీస్ సంబంధాల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల ఆస్ట్రోనోమర్ సీఈఓ ఆండీ బైరాన్, కోల్స్ సీఈఓ యాష్లే బుకానన్, నార్ఫోక్ సదరన్ సీఈఓ అలాన్ షా తమ పదవులకు దూరమయ్యారు. గతంలో బీపీ సీఈఓ బెర్నార్డ్ లూనీ, ఎన్బీసీ యూనివర్సల్ బాస్ జెఫ్ షెల్, మెక్‌డొనాల్డ్స్ సీఈఓ స్టీవ్ ఈస్టర్‌బ్రూక్, ఇంటెల్ సీఈఓ బ్రియాన్ క్రజానిక్, రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా సీఎఫ్‌ఓ నాడిన్ ఆన్ కూడా ఇదే తరహా కారణాలతో ఉద్వాసనకు గురయ్యారు.

కార్యాలయ ప్రేమ వ్యవహారాలపై కంపెనీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి?

ఉన్నతాధికారులు, వారి కింద పనిచేసే ఉద్యోగుల మధ్య సంబంధాల్లో అధికార అసమతుల్యత ప్రధాన సమస్యగా మారుతోంది. ఇవి పరస్పర అంగీకారంతో జరిగినప్పటికీ, పని ప్రదేశంలో పక్షపాతం, ప్రయోజనాల సంఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని సంస్థలు భావిస్తున్నాయి. సర్వేల ప్రకారం.. కేవలం 22 శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ ఆఫీస్ సంబంధాలను సంస్థలకు వెల్లడిస్తుండగా, మెజారిటీ ఉద్యోగులు వీటిని రహస్యంగానే ఉంచుతున్నారు.

నిషేధం కంటే పారదర్శకతే మేలా.. నిపుణుల సూచన ఏంటి:

కఠినమైన నిషేధాలు ఉన్నప్పటికీ ఆఫీస్ రొమాన్స్‌లను అడ్డుకోవడం సాధ్యం కావడం లేదని, అందుకే నిబంధనల విషయంలో కంపెనీలు పునరాలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి బదులుగా, రహస్యంగా తమ సంబంధాలను వెల్లడించే (Disclosure) వేదికలను కల్పించి, పక్షపాతం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు.