కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిన ఈ మహమ్మారి చైనాని సర్వ నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. 70కుపైగా దేశాల్లో వ్యాపించిన కరోనా..
కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిన ఈ మహమ్మారి చైనాని సర్వ నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. 70కుపైగా దేశాల్లో వ్యాపించిన కరోనా.. అల్లకల్లోలం సృస్టిస్తోంది. 3వేల 500మందిని బలి తీసుకుంది. సుమారు 80వేల మంది కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రెండు నెలల క్రితం చైనాలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా సైంటిస్టులు కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు సక్సెస్ సాధించలేకపోయారు. దీంతో కరోనాని ఎదుర్కోవడం ఎలానో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో షాకింగ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ఆ రిపోర్టు మరింత భయపెడుతోంది.
సీజనల్ వ్యాధిలా ప్రతి ఏటా వస్తుంది:
ఆ నివేదిక ప్రకారం.. కరోనా.. సీజనల్ వ్యాధి లాంటిది. ఇతర సీజనల్ వ్యాధుల్లాగే.. ఇకపై కరోనా కూడా ప్రతి సంవత్సరం వస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు లాంటి సీజనల్ వ్యాధుల్లానే.. కరోనా కూడా అటాక్ అవుతుంది. లండన్ కు చెందిన క్వీన్ మేరీ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. సీజన్ వ్యాధుల్లాగే ప్రతి ఏడాది.. సీజన్ లో కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని వారి పరిశోధనలో తేలింది. ప్రతి సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు వంటివి కరోనా వైరస్ వ్యాప్తికి దోహదపడతాయని సైంటిస్టులు అంటున్నారు. కరోనా వైరస్ కి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జలుబు, దగ్గుతో మొదలై శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏర్పడటం కరోనా లక్షణం. సాధారణ సీజనల్ వ్యాధుల్లోనూ మనకు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి.
కరోనా గురించి బాంబు పేల్చిన సైంటిస్టులు:
లండన్‌కు చెందిన ప్రఖ్యాత క్వీన్ మేరీ వర్సిటీ సైంటిస్టుల బృందం కొంతకాలంగా కొవిడ్-19(కరోనా వైరస్)పై భారీ ప్రయోగాలు చేస్తోంది. కరోనాలో సీజనల్ వ్యాధుల లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, అది ఇప్పటికిప్పుడు తగ్గిపోయే లేదా అంతమైపోయే వైరస్ కాదని సైంటిస్టులు చెప్పారు. సీజనల్ ఇన్‌ఫెక్షన్ లాగా మళ్లీ మళ్లీ విజృంభించే అవకాశాలు కరోనాలో చాలా ఉన్నాయని వారు వివరించారు. కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోతుందని ఇప్పుడే చెప్పలేమన్నారు. 50 ఏళ్లుగా అందరికీ తెలిసిన ఇతర వైరస్ ల లాగానే.. సీజనల్ వైరస్ లా కరోనా మళ్లీ వచ్చే అవకాశముందని సైంటిస్టులు చెబుతున్నారు. జలుబు, ఫ్లూ జ్వరం, ఛాతిలో ఇన్‌ఫెక్షన్ లాగానే కరోనా కూడా ఎప్పటికీ ఉండిపోయే(శాశ్వత) వైరస్ అని చెప్పారు. క్వీన్ మేరీ వర్సిటీ సైంటిస్టుల నివేదిక ప్రఖ్యాత డెయిలీ మెయిల్ లో పబ్లిష్ అయ్యింది.(తెలంగాణలో రెండో కరోనా కేసు?)
కరోనాను ఎదుర్కోవడం ఎలా:
కరోనా సీజనల్ వ్యాధి లాంటిదని, ఇతర సీజనల్ వ్యాధుల్లా.. ప్రతి ఏటా సీజన్ లో కరోనా వస్తుందని సైంటిస్టులు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అందరిలోనూ భయాందోళనలు నింపింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి 2 నెలలు అవుతున్నా ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు. ఇప్పటికే వేలాది మందిని కరోనా బలితీసుకుంది. ఈ పరిస్థితుల్లో కరోనా ప్రతి ఏటా వస్తుందనే వార్త ప్రజల్లో మరింత ఆందోళన నింపింది.