Hana Rāwhiti Maipi-Clarke,
New Zealand MP: న్యూజిలాండ్ పార్లమెంట్ లో అతిపిన్న వయస్కురాలైన ఎంపీ హనా రాహితి మైపీ క్లార్క్ రచ్చ చేశారు. సంప్రదాయ మావోరీ తెగకు చెందిన హాకా నృత్యం (మావోరీ సంప్రదాయంలో రౌద్రం, పరాక్రమం కలగిలిపన హావభావాలను ప్రదర్శిస్తూ సాగే నృత్యం) ప్రదర్శించి వివాదాస్పద బిల్లు కాపీనీ చింపేసింది. గురువారం న్యూజిలాండ్ పార్లమెంట్ లో అక్కడి ప్రభుత్వం స్వదేశీ ఒప్పంద బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లు కాపీలను 22ఏళ్ల మహిళా ఎంపీతోపాటు మావోరీ తెగకు చెందిన ఎంపీలు బిల్లు కాపీలను చింపేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత సంవత్సరం పార్లమెంట్ లో తొలి ప్రసంగం సందర్భంగా తన మాతృభాష మావోరీలో పార్లమెంట్ దిక్కులు పిక్కటిల్లేలా చేతులతో సంజ్ఞలు చేస్తూ గంభీరంగా ఆమె ప్రసంగించిన విషయం తెలిసిందే.
Also Read: చైనా దూకుడు.. ఫైటర్ జెట్లలోనూ అమెరికాకు పోటీ ఇస్తున్న డ్రాగన్..
బ్రిటిష్, స్వదేశీ మావోరీల మధ్య 184 ఏళ్ల నాటి ఒప్పందాన్ని పునర్నిర్వచించే స్వదేశీ ఒప్పంద బిల్లుపై పార్లమెంట్ లో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ కు అంతరాయం కలిగించడానికి మావోరీ ఎంపీ సభ్యులు హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. వారి సీట్లలో నుంచి లేచి తమ నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎంపీ హనా రాహితి మైపీ క్లార్క్ స్వదేశీ ఒప్పంద బిల్లును చించేసి తన నిరసనను తెలిపింది. ముఖ్యంగా, 1840 వైతాంగి ఒప్పందలో నిర్దేశించిన సూత్రాల ప్రకారం.. బ్రిటీష్ వారికి పాలనను అప్పగించినందుకు ప్రతిగా గిరిజనులకు వారి భూములను నిలుపుకోవడానికి, వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి విస్తృత హక్కులను కల్పిస్తూ వాగ్దానం చేశారు. ఆ హక్కులు న్యూజిలాండ్ దేశస్తులందరికీ వర్తింపజేయాలని బిల్లులో చేర్చడం జరిగిందని తెలుస్తోంది. దేశంలోని సెంటర్ – రైట్ సంకీర్ణ ప్రభుత్వానికి మిత్రపక్షమైన ఏసీటీ న్యూజిలాండ్ పార్టీ ఈ బిల్లును ప్రవేశపెట్టింది.
ఈ బిల్లు కారణంగా జాతి వైషమ్యాలకు, రాజ్యాంగ విధ్వంసానికి ముప్పు కలిగిస్తోందని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్ లో 5.3 మిలియన్ల జనాభాలో మావోరీలు దాదాపు 20శాతం మంది ఉన్నారు. వారంతా ఈ బిల్లును తమ హక్కులకు ముప్పుగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ఆ తెగకు చెందిన ఎంపీ హనా రాహితి మైపీ క్లార్క్ తోపాటు ఇతర ఎంపీలు తమ నిరసనను తెలిపారు. దీంతో సభ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. హనా రాహితి మైపీ క్లార్క్ హాకా నృత్యం చేస్తూ బిల్లు కాపీలను చింపేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.