Nobel Prize 2026 : రసాయన శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం..

Nobel Prize 2026 : ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ కగాన్‌, జపాన్‌కు చెందిన కెన్సో సొవాయ్‌లకు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.

Henri B. Kagan, Kensō Soai

Nobel Prize 2026 : 2026 సంవత్సరానికి సంబంధించిన నోబెల్ కెమిస్ట్రీ పురస్కారం ఇద్దరు శాస్త్రవేత్తలకు లభించింది. వీరిలో ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి. కగాన్ (Henri B. Kagan) ఒకరైతే.. మరొకరు జపాన్‌కు చెందిన కెన్సో సోయ్ (Kensō Soai). రసాయనిక చర్యల్లో ఒక అణువు రెండు ‘అద్దం ప్రతిబింబాల’ రూపాల్లో ఏర్పడే ప్రక్రియను అర్థం చేసుకోవడంలో చేసిన కీలక పరిశోధనలకు వీరిని ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు. ముఖ్యంగా నాన్-లీనియర్ ఎఫెక్ట్స్, ఆటోక్యాటలిసిస్ ఇన్ అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్‌పై చేసిన పరిశోధనకు ఈ అవార్డు దక్కింది. సుమారు 1.2 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని ఇద్దరు విజేతలు పంచుకోనున్నారు.

Also Read : Facebook : ఫేస్‌బుక్ యూజర్లకు బిగ్ న్యూస్.. పూర్తిగా మారిపోతుంది.. ఓపెన్ చేయగానే ఇకపై ఫుల్‌స్క్రీన్ వీడియోలు!

విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే… మన ఎడమ చేయి, కుడి చేయి ఒకదానికొకటి అద్దంలో కనిపించే ప్రతిబింబాల్లా ఉంటాయి. కానీ ఎడమ చేతిని కుడి చేతిపై పూర్తిగా అమర్చలేం. ఇదే విధంగా కొన్ని రసాయన అణువులు కూడా రెండు మిర్రర్-ఇమేజ్ రూపాల్లో ఉంటాయి. వీటిని ఎనాంటియోమర్స్ అంటారు. అణువులు ఒకే రకమైన పరమాణువులతో తయారైనా.. వాటి అమరిక వేర్వేరుగా ఉండటంతో శరీరంలో వాటి ప్రభావం కూడా భిన్నంగా ఉండొచ్చు.

ఈ అంశంలో అసలు మిస్టరీ ఏమిటంటే.. ప్రకృతిలో ఇలాంటి అణువులు రెండు రూపాల్లో ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ.. జీవరాశుల్లో మాత్రం కొన్ని కీలక అణువులలో ఒకే రూపం ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రోటీన్ల నిర్మాణంలో ఉపయోగించే అమైనో ఆమ్లాలు ప్రధానంగా ఒక నిర్దిష్ట రూపంలోనే ఉంటాయి. ఈ విధానాన్ని హోమోచైరాలిటీ అంటారు. ఇది జీవం ఎలా ఏర్పడింది, రసాయనిక ప్రక్రియలు ఎలా పనిచేస్తాయన్నదానిపై శాస్త్రవేత్తలను చాలాకాలంగా ఆలోచింపజేసిన ప్రశ్న.

ఈ పరిశోధనకు శాస్త్రీయ ప్రాధాన్యంతో పాటు ఔషధాల తయారీలోనూ ఎంతో విలువ ఉంది. ఒకే రసాయనానికి చెందిన రెండు అద్దం రూపాల్లో ఒకటి మందుగా సమర్థంగా పనిచేయవచ్చు.. మరొకటి మాత్రం భిన్నమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అందువల్ల అవసరమైన అణు రూపాన్ని ఖచ్చితంగా తయారు చేయడం ఫార్మా రంగంలో చాలా కీలకం. భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన ఔషధాల తయారీ, రసాయన పరిశ్రమలో ఖచ్చితమైన ప్రక్రియల అభివృద్ధికి ఈ పరిశోధనలు ఉపయోగపడే అవకాశం ఉంది.