×
Ad

North Korea : ఉత్తరకొరియాలో వారసత్వ యుద్ధం.. పీఠం కోసం అత్తాకోడళ్లు పోరు.. ప్రపంచాన్ని వెంటాడుతున్న భయాలేంటి ?

North Korea : అధికార పీఠం కోసం అత్తాకోడళ్ల యుద్ధం. ఇదేదో మాములు రాజకీయ యుద్ధం కాదు.. ఉత్తరకొరియా అధికార పీఠం కోసం జరుగుతున్న వార్‌. దేశానికి వారసురాలిగా తన కూతురును ప్రకటించేందుకు కిమ్ జోంగ్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పుడు ఆయన సోదరి గురించి చర్చకు వస్తోంది..

North Korea

  • ఉత్తరకొరియాలో వారసత్వ యుద్ధం
  • కిమ్ జోంగ్ కూతురు వర్సెస్ చెల్లెలు..
  • అధికార పీఠం కోసం అత్తాకోడళ్లు యుద్ధం
  • కూతురిని వారసురాలిగా ప్రకటించేందుకు కిమ్ రెడీ!
  • అదే జరిగితే కిమ్ చెల్లెలి నుంచి సవాల్‌ ఖాయం!

North Korea : అధికార పీఠం కోసం అత్తాకోడళ్ల యుద్ధం. ఇదేదో మాములు రాజకీయ యుద్ధం కాదు.. ఉత్తరకొరియా అధికార పీఠం కోసం జరుగుతున్న వార్‌. దేశానికి వారసురాలిగా తన కూతురును ప్రకటించేందుకు కిమ్ జోంగ్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పుడు ఆయన సోదరి గురించి చర్చకు వస్తోంది.. ఇన్నాళ్లూ దేశాన్ని శాసించిన ఆయన చెల్లెలు.. మౌనంగా ఉంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్‌. అధికారం కోసం రక్త చరిత్ర సృష్టించే కిమ్‌ వంశంలో ఇప్పుడేం జరగబోతోంది.. ఇంతకీ ఉత్తరకొరియాలో ఏం జరుగుతోంది.. అనేది చర్చనీయాంశంగా మారింది.

Also Read : రేపు కొలువుదీరనున్న బంగ్లాదేశ్‌ ప్రభుత్వం.. ఇక యూనస్‌ దారెటు? ఆయన సలహాదారుగా ఉన్న సమయంలో రచ్చ రచ్చ

కూతురికి వారసత్వ పగ్గాలు అప్పగించేందుకు.. 
కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. ఉత్తరకొరియా మాటెత్తితే.. వినిపించే ఒకే ఒక్క పేరు. నియంత పాలనతో.. సంచలన నిర్ణయాలతో.. ఆ దేశ జనాలకే కాదు.. ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న నాయకుడు. ప్రస్తుతం ఆయన వయసు 42 ఏళ్లు. పాలించడానికి.. పాలకుడిగా కొనసాగడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఐతే ఇప్పుడే ప్రపంచానికి తన కూతురుని పరిచయం చేస్తున్నాడు. కుటుంబ పాలనను.. నాలుగో తరానికి అప్పగించేందుకు ప్రయత్నాలు స్పీడప్ అవుతున్నాయి. దీంతో ఉత్తర కొరియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తన వారసత్వ పగ్గాలను కూతురికి అప్పగించేందుకు కిమ్ తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులతో.. తెర వెనక వ్యవహారాలు వేగంగా మారుతున్నాయి. తండ్రితో పాటు.. కూతురు కిమ్ జుయే వరుసగా అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో కాబోయే నేతగా 13ఏళ్ల కూతురు కిమ్‌ జుయేను.. కిమ్ జోంగ్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని.. దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. ఇదే ఇప్పుడు వాల్డ్‌వైడ్‌గా హాట్‌టాపిక్‌ అవుతోంది.

కిమ్ యో జోంగ్‌‌కు నచ్చలేదనే ప్రచారం.. 
ఏడాదిగా తన విదేశీ పర్యటనకు కూడా.. కూతురుని వెంటేసుకొని వెళ్తున్నాడు కిమ్‌. ఇదే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత రహస్య దేశమైన ఉత్తరకొరియాలో కుటుంబ పోరుకు తెర తీసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారానికి కారణం అవుతోంది. ఫిబ్రవరి చివరలో జరగనున్న ఉత్తర కొరియా వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సమావేశంపై ఇప్పుడు యావత్ ప్రపంచం కన్నేసింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ కీలక సమావేశంలో.. కిమ్ తన కూతురును అధికారికంగా వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కూతురికి పగ్గాలు అప్పగించాలనే కిమ్‌ నిర్ణయం.. ఆయన సోదరి, దేశంలోనే రెండో అత్యంత శక్తివంతమైన మహిళగా పేరున్న కిమ్ యో జోంగ్‌‌కు నచ్చలేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో కిమ్ జుయేకు, కిమ్ కుమార్తెకు మధ్య భవిష్యత్తులో తీవ్రమైన అధికార పోరుకు దారితీస్తుందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.

ఆయుధ పరీక్షల నుంచి మిలిటరీ పరేడ్‌ల వరకు..
13ఏళ్ల కిమ్‌ జుయే.. 2022లో తొలిసారిగా ప్రపంచానికి కనిపించింది. ఆ తర్వాత ఆయుధ పరీక్షల నుంచి మిలిటరీ పరేడ్‌ల వరకు.. అధికారిక, కీలక కార్యక్రమాల్లో తండ్రి వెంట హాజరైంది. వాస్తవానికి ఉత్తరకొరియా పురుషాధిక్య నాయకత్వ క్రమాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఆమెకు వారసత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి‌. కానీ, గతేడాది సెప్టెంబరులో కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో కలిసి బీజింగ్‌ పర్యటనకు వెళ్లడంతో ప్రపంచం దృష్టి ఆమెపై పడింది. కిమ్‌ రాజకీయ వారసురాలు ఆమెనే అనే అంచనాలు నాటినుంచే బలపడ్డాయి. అదే నిజం అయితే.. ఆమె అత్త కిమ్ యో జోంగ్ ఏం చేయబోతున్నారనేది అతిపెద్ద ప్రశ్న. 38ఏళ్ల వయసున్న కిమ్ యో జోంగ్‌.. అన్నకు నీడలా ఉంటూ దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. పీఠం కోసం ఆమె తన కోరికను చంపుకుంటుందా అంటే.. అనుమానమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమెకు సైన్యంలో, రాజకీయ వర్గాల్లో బలమైన పట్టు ఉందని. ఒకవేళ తనకు అవకాశం ఉందని భావిస్తే.. ఆమె కచ్చితంగా తన సొంత పొలిటికల్ ప్రాజెక్ట్ అమలు చేస్తారనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

సోదరి నుంచి ప్రతిఘటన ఎదురయ్యే ఛాన్స్ .. 
కూతురికి వారసత్వ పగ్గాలు అందించాలని నిర్ణయం తీసుకుంటే.. సోదరి నుంచి కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. కిమ్‌ యో జోంగ్‌ ప్రస్తుతం.. దేశంలోనే రెండో అత్యంత శక్తిమంతమైన నాయకురాలిగా ఉన్నారు. కొరియా వర్కర్స్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీలో సీనియర్ హోదాలో కొనసాగుతున్నారు. ఆమెకు దేశం లోపలా, వెలుపలా మంచి పాపులారిటీ ఉంది. సోదరుడి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాలన పైనా.. ఆమె ప్రభావం చూపించగలరనే టాక్‌ నడుస్తోంది. 2022లో దక్షిణ కొరియా రక్షణమంత్రిని టార్గెట్ చేస్తూ.. కిమ్‌ యో జోంగ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. దక్షిణ కొరియా వినాశనం తప్పదంటూ అప్పట్లో ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ఆ తర్వాత కూడా అమెరికా, జపాన్‌లాంటి దేశాలను హెచ్చరిస్తూ.. టాక్ ఆఫ్‌ ది జియో పాలిటిక్స్‌గా నిలిచారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు హఠాత్తుగా ఏమైనా జరిగితే.. ఆ తర్వాత అధికార బాధ్యతలు అందుకునేది అతని సోదరే అని గతంలోనే అంచనాలు వినిపించాయి‌. రాజకీయంగానే కాదు.. ఆమెకు మిలిటరీ మద్దతు కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు కూతురికి కిమ్ పట్టం కడితే.. ఆమె చూస్తూ ఊరుకునే పరిస్థితి కనిపించడం లేదు.

సోదరి యో జోంగ్‌ వ్యతిరేకిస్తే.. ఏం జరుగుతుంది..
అధికారం కోసం సొంత కుటుంబ సభ్యులనే నిర్దాక్షిణ్యంగా అంతం చేసిన ఘటనలు ఉత్తర కొరియాలో ఉన్నాయి. 2013లో కిమ్.. తన మేనమామ, గురువు అయిన జాంగ్ సాంగ్ థేక్‌ను ద్రోహిగా ముద్రవేసి కాల్చి చంపించాడు. 2017లో మలేషియా విమానాశ్రయంలో సవతి అన్న కిమ్ జోంగ్ నామ్‌ను.. రసాయన దాడితో కిమ్ మనుషులు అంతం చేశారనే ఆరోపణలు ఉన్నాయి‌. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై.. కిమ్‌ ఈ చర్యలు తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇలా కిమ్ కూర్చుకున్న అధికార పీఠానికి.. సొంత ఫ్యామిలీ రక్తమే అంటుకొని ఉంది. అలాంటిది కూతురిని కిమ్ వారసురాలిగా ప్రకటిస్తే.. ఆ నిర్ణయాన్ని సోదరి యో జోంగ్‌ వ్యతిరేకిస్తే.. ఏం జరుగుతుంది.. అత్తా కోడలి యుద్ధం వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి‌. ఇక అటు వారసత్వం విషయంలో కిమ్ నిర్ణయాలతో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. ప్రస్తుతం ఉత్తర కొరియా దగ్గర సుమారు 50 నుంచి 90 వరకు అణు వార్‌హెడ్లు ఉన్నాయని అంచనా. ఇలాంటి శక్తివంతమైన దేశాన్ని 13 ఏళ్ల బాలికకు అప్పగిస్తే.. సైనిక శ్రేణులు ఎలా స్పందిస్తాయనేది మిస్టరీగా మారింది. ఫిబ్రవరి నెలాఖరులో జరిగే సమావేశం.. కిమ్ జుయే ఏ భవిష్యత్తును మాత్రమే కాదు, ఉత్తర కొరియా స్థిరత్వాన్ని కూడా నిర్ణయించడం ఖాయంగా కనిపిస్తోంది.