×
Ad

Pakistan : అఫ్గానిస్థాన్‌పై పాక్ బాంబుల వర్షం.. మరోసారి ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం

Pakistan : పాకిస్థాన్ తన పొరుగుదేశం ఆఫ్ఘనిస్థాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ఆకస్మిక దాడులకు తెగబడింది.

Pakistan

  • ఆఫ్ఘనిస్థాన్‌పై విరుచుకుపడిన పాకిస్తాన్‌
  • ఆప్ఘన్‌ బోర్డర్‌లో ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు
  • 30మంది వరకు మరణించినట్టు సమాచారం.. పలువురికి గాయాలు 

Pakistan : పాకిస్థాన్ తన పొరుగుదేశం ఆఫ్ఘనిస్థాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ఆకస్మిక దాడులకు తెగబడింది. అఫ్ఘాన్ బోర్డర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిన పాకిస్థాన్.. ఆదివారం తెల్లవారుజామున మెరుపుదాడులు చేసింది. సరిహద్దుల వెంబడి ఏడు ప్రాంతాల్లో వైమానిక దాడులకు పాల్పడింది. ఈ వైమానిక దాడులను అటు పాకిస్థాన్, అటు ఆఫ్ఘనిస్థాన్ ధ్రువీకరించాయి. ఈ దాడుల్లో దాదాపు 30 మంది వరకు మరణించినట్లు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.


పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ మసీదుపై కొద్దిరోజుల క్రితం ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. దీని వెనుక ఆప్ఘనిస్థాన్ ఉందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్థాన్‌పై తాజాగా పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడులు ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్, పాక్టికా, ఖోస్ట్ ప్రావిన్సుల్లో జరిగాయని అఫ్ఘానిస్థాన్ మీడియా తెలిపింది.

 

ఈ దాడులపై ఆప్ఘనిస్థాన్ స్పందించింది. పాకిస్థాన్ దాడులు జరిగిన ఖచ్చితమైన ప్రదేశాలను పేర్కొనలేదు. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలాఉంటే.. ఇటీవలి కాలంలో పదేపదే ఘర్షణలు, సరిహద్దు మూసివేతల కారణంగా ఇప్పటికే రెండు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ దాడులతో ఇరు దేశాల మధ్య మరింత ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది.

ఈ దాడులపై పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరూర్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దాడులను ధ్రువీకరించారు. పాక్ తాలిబాన్, దాని అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఐసిస్ అనుబంధ గ్రూప్‌పై సైతం దాడి చేసినట్లు తరూర్ పేర్కొన్నారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఉగ్రవాదులకు సంబంధించిన ఏడు స్థావరాలపై పాక్ వైమానిక దాడి చేసిందని తెలిపారు.