Pakistan Bomb blast : బాంబుల మోతతో దద్దరిల్లిన పాకిస్థాన్.. మూడు ప్రాంతాల్లో 25మందికిపైగా మృతి

పాకిస్థాన్ బాంబుల (Pakistan Bomb blast) మోతతో దద్దరిల్లింది. మూడు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 25మందికిపైగా మరణించారు.

Pakistan Bomb blast

Pakistan Bomb blast : పాకిస్థాన్ బాంబుల మోతతో దద్దరిల్లింది. మూడు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 25మందికిపైగా మరణించినట్లు అధికారులు తెలిపారు.

Also Read: Afghanistan Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మరో భూకంపం.. 1,400 మృతిని మరవకముందే..

బలోచిస్థాన్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్ వర్ధంతి సందర్భంగా బలోచ్ రాజధాని క్వెట్టాలో బీఎన్‌పీ రాజకీయ సభ నిర్వహించింది. బలోచ్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 14మంది మరణించగా.. 30మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి.

మరోవైపు.. ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బలూచిస్థాన్‌లో మంగళవారం జరిగిన మరో దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని సైనిక స్థావరంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు సైనికులు మరణించారు. పాకిస్థాన్ లో ఒకేరోజు మూడు ఆత్మాహుతి దాడుల్లో 25మందికిపైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే, క్వెట్టాలో బీఎన్‌పీ ర్యాలీ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

జాతీయవాద నాయకుడు, మాజీ ప్రావిన్షియల్ ముఖ్యమంత్రి సర్దార్ అతావుల్లా మెంగల్  కుమారుడు సర్దార్ అక్తర్ మెంగల్ లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, అక్తర్ మెంగల్ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ పేలుడుపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఆత్మాహుతి దాడి ఘటన తరువాత అక్తర్ మెంగల్ ట్విటర్ వేదికగా తాను సురక్షితంగా ఉన్నానని, తమ మద్దతుదారులను కోల్పోవడం బాధగా ఉందని అన్నారు. ‘‘ మీ ప్రార్ధనల వల్ల నేను సురక్షితంగా ఉన్నాను. కానీ, మన మద్దతుదారులను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. దాదాపు 15మంది అమరులయ్యారు. చాలా మంది గాయపడ్డారు. వారు నాతోపాటు నిలిచి మన లక్ష్యం కోసం తమ ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోలేము’’ అని పేర్కొన్నారు.