అఫ్గాన్ – పాక్ మధ్య భీకర పోరు.. అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించిన పాక్..
Pakistan Afghanistan War 2026 : పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అఫ్గాన్‌పై పాకిస్థాన్ అధికారికంగా యుద్ధాన్ని మొదలు పెట్టింది.
- Harishth Thanniru
- Published On : February 27, 2026 / 08:18 AM IST
Pakistan Afghanistan war
- పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం
- కాబూల్, పలు నగరాలపై పాక్ వైమానిక దాడులు
- గజీబ్ లిల్ హాక్ పేరుతో మిలటరీ ఆపరేషన్ ప్రారంభం
- ప్రకటించిన పాక్ రక్షణ శాఖ మంత్రి
Pakistan Afghanistan War 2026 : ఆసియా ఖండంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలతో అట్టుడుకుతున్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అఫ్గాన్‌పై పాకిస్థాన్ అధికారికంగా యుద్ధాన్ని మొదలు పెట్టింది. గజీబ్ లిల్ హాక్ పేరుతో మిలటరీ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ రాజధాని కాబూల్‌పై వైమానిక దాడులతో పాకిస్థాన్ విరుచుకుపడుతుంది.
కొద్దిరోజులుగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. ఇటీవల పాకిస్థాన్ దేశంలో జరిగిన బాంబు పేలుళ్ల వెనుక అఫ్గాన్ ఉందని ఆ దేశం భావిస్తుంది. ఈ క్రమంలో అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో అఫ్గాన్ పౌరులు అనేక మంది మరణించారు.
ప్రతీకారంగా గురువారం రాత్రి అఫ్గాన్ దళాలు పాకిస్థాన్ పై మెరుపుదాడి చేశాయి. తమ దళాలు సరిహద్దు దాటివచ్చి పాకిస్థాన్‌కు చెందిన సుమారు 19 సైనిక పోస్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని, ఈ క్రమంలో 55 మంది పాక్ సైనికులను మట్టుబెట్టామని అఫ్గాన్ ప్రకటించింది. దీంతో తీవ్రమైన గొడవ.. ఇప్పుడు ఏకంగా వైమానిక దాడుల వరకు దారితీసింది.
శుక్రవారం తెల్లవారుజామున పాకిస్థాన్ సైన్యం అఫ్గాన్‌పై ప్రతీకార చర్యలకు దిగింది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ సహా కందహార్, పక్తియా వంటి ప్రధాన నగరాలపై పాకిస్థాన్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. అయితే, ఈ దాడులను అఫ్గాన్ దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు, పాక్ యుద్ధ విమానాన్ని అఫ్గాన్ బలగాలు కూల్చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.
మరోవైపు పాకిస్థాన్ జరిపిన వైమానికదాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అఫ్గాన్ ప్రభుత్వం ప్రకటించింది.
🚨 BIG BREAKING NEWS💥
This is a Pakistani military F-16, American-made, that Afghan defensive forces have shot down. pic.twitter.com/7qBAjv89rk
— Afghanistan Defense (@AFGDefense) February 27, 2026
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ‘మా సహనం నశించింది. ఇప్పుడు మాకు.. మీకు మధ్య బహిరంగ యుద్ధమే’ అని అఫ్గానిస్థాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. దీంతో పాకిస్థాన్ అఫ్గాన్‌పై భీకర దాడులకు దిగింది.
