Pakistan Deputy PM Ishaq Dar
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్ సైన్యం మిసైళ్ల దాడికి దిగింది. ప్రతిగా భారత్ ఆర్మీ పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడి చేసింది. రావల్పిండి, పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు వైమానిక స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు చేసిన తరువాత.. కాల్పుల విరమణ కోసం భారత దేశాన్ని పాకిస్థాన్ విజ్ఞప్తి చేసిందని, ఆ మేరకు మా నుంచే సంప్రదింపులు ప్రారంభించామని పాకిస్థాన్ ఉపప్రధాన మంత్రి ఇసాక్ దార్ అన్నారు.
పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య యుద్ధం తలెత్తకుండా నేనే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. తాజాగా.. ఇదే అంశంపై పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అసలు విషయం బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ పై దాడులు ఆపాలని భారత దేశాన్ని తామే విజ్ఞప్తి చేశామని చెప్పారు.
‘‘ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఆర్మీ పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడులకు దిగింది. పాకిస్థాన్‌లోని ముఖ్య వైమానిక స్థావరాలైన నూర్ ఖాన్, షోర్‌కోట్‌లపై దాడి చేసింది. నూర్‌ఖాన్ వైమానిక స్థావరం పాకిస్తాన్‌లోని అత్యంత సున్నితమైన సైనిక స్థావరాల్లో ఒకటి. ఇది వైమానిక దళ కార్యకలాపాలు, వీఐపీ రవాణా విభాగాలు రెండింటినీ కలిగి ఉంది. ఆరోజు తెల్లవారు జామున 4గంటల సమయంలో భారతదేశంపై దాడులు చేయాలని పాకిస్థాన్ సైన్యం సిద్ధమైంది.. ఈలోపే భారత్ ఆర్మీ తెల్లవారుజామున 2.30 గంటలకు నూర్ ఖాన్, షోర్‌కోట్ ఎయిర్ బేస్‌లు, ఇతర ప్రదేశాల్లో క్షిపణి దాడులు చేసినట్లు గుర్తించాం. ఈ దాడుల వల్ల తమ దేశానికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరినట్లు ఇషాక్ దార్ తెలిపారు.
నూర్‌ఖాన్ వైమానిక స్థావరంపై దాడి జరిగిన 45 నిమిషాల తరువాత సౌదీ యువరాజు పైసల్ నాకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణ గురించి భారత్‌తో మాట్లాడాలా అని అడగగా.. అవును సోదరా.. సహాయం చేయమని నేను కోరాను. మరోవైపు ఈ విషయంపై అమెరికాతోనూ చర్చలు జరిపాం. కొద్దిసేపటికే ఫైసల్ మళ్లీ కాల్ చేసి తాను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడాను.. భారత్ కూడా కాల్పుల విరమణకు సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు.. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం సర్దుమణిగిందని ఇషాక్ దార్ ఇంటర్వ్యూలో చెప్పారు.’’