Pakistan Lockdown : పాక్‌లో లాక్‌డౌన్..! రాత్రి 9 గంటల తర్వాత అవన్నీ క్లోజ్.. పెళ్లి విందులో ఒకే వంటకం…

Pakistan Lockdown : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, పెరుగుతున్న ఇంధన వ్యయం పాక్ ఎకానమీని చావుదెబ్బ కొడుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి పాక్‌ ప్రభుత్వం అత్యంత కఠినమైన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది.

Pakistan Lockdown

Pakistan Lockdown : పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. ధరలు పెరిగిపోయి.. ఆర్థిక వ్యవస్థ కూలిపోయి.. అప్పు పుడితే తప్ప కడుపు నిండని పరిస్థితి కనిపిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆ దేశ జనాల కడుపు కొడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో.. సామాన్య జనాలు వాటిని అసలే కొనలేకపోతున్నారు. ప్రపంచం అంతా అప్పులు చేస్తున్న పాక్‌.. ఆ నిధులను ఉగ్రవాదులను మేపడానికే ఉపయోగిస్తోంది. జనాల ఆకలిని, సమస్యలను గాలికి వదిలేస్తోంది. మంచి ఆహారానికి కూడా జనాలు దూరం అవుతున్నారంటే.. అర్థం చేసుకోవచ్చు ఆ దేశంలో పరిస్థితి !

Also Read : Trump Russia Sanctions Bill : రష్యా ఆంక్షల బిల్లుపై సంతకం.. భారత్, చైనాకు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైన ట్రంప్..

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, పెరుగుతున్న ఇంధన వ్యయం పాక్ ఎకానమీని చావుదెబ్బ కొడుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి పాక్‌ ప్రభుత్వం అత్యంత కఠినమైన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశంలో ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా.. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కీలక నిబంధనలతో స్మార్ట్ లాక్ డౌన్ అమల్లోకి తెచ్చింది. మిడిలీస్ట్‌లో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో.. ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది పాకిస్థాన్ ప్రభుత్వం పొదుపు చర్యలు ప్రకటించడం ఇది రెండోసారి. ఇప్పుడు ప్రకటించిన చర్యలు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయి.

ఇంధన ధరల పెరుగుదలను కంట్రోల్ చేసేందుకు పాక్ సర్కార్‌ కీలక ఆంక్షలు విధించింది. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనాన్ని తగ్గించనున్నారు. ప్రభుత్వం కొత్త వాహనాలు కొనుగోలు చేయడంపై నిషేధం విధించింది. ప్రభుత్వ అధికారులు విదేశీ పర్యటనలు చేయకుండా ఆంక్షలు విధించారు. ఇక విదేశీ అతిథులు, ప్రతినిధి బృందాలకు ఇచ్చే విందులు మినహా.. ప్రభుత్వ అధికారిక విందులపై నిషేధం విధించారు. ఐటీకి సంబంధించిన కొనుగోళ్లను మినహాయించి.. ప్రభుత్వం కొనుగోలు చేసే దీర్ఘకాలిక వస్తువులపై ఆంక్షలు విధించారు. సమావేశాలను ప్రత్యక్షంగా నిర్వహించకుండా వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా నిర్వహించాలని సూచించారు.

వ్యాపార సంస్థల పని వేళలను కూడా తగ్గించారు. దేశవ్యాప్తంగా ఉన్న షాపింగ్ మాల్స్, మార్కెట్లను రాత్రి 9 గంటలకే మూసివేయాల్సి ఉంటుంది. మెడికల్ షాపులు, ల్యాబ్‌లకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. వివాహ మండపాలు రాత్రి పదింటికి, రెస్టారెంట్లు రాత్రి 11 గంటలకు క్లోజ్ చేయాలి. పెళ్లిళ్లకు వచ్చేవారికి విందులో కేవలం ఒకే ఒక్క వంటకం మాత్రమే వడ్డించాలని స్పష్టమైన నిబంధన విధించింది.

జనాల బాధలను పట్టించుకునే ప్రభుత్వమే పాకిస్థాన్‌లో ఎప్పుడూ లేదు. ప్రపంచం అంతా అప్పులు చేయడం.. ఆ నిధులను ఉగ్రవాదం మీద ఖర్చు చేయడం.. జనాల సమస్యలను కనీసం పట్టించుకోకపోవడం.. ఇవన్నీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం పాక్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. దీంతో నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి‌. ఆహార సంక్షోభం ఏర్పడి.. పౌష్టికాహారం అగమ్యగోచరంగా మారింది.

పాక్‌ జీడీపీలో అప్పుల భారం 70 నుంచి 80శాతానికి చేరింది. సంపాదనలో ఎక్కువ భాగం వడ్డీలకే పోతోంది. విదేశీ మారక నిల్వలు అడుగంటడంతో.. మిత్రదేశాల సాయంపై ఆధారపడుతోంది. ప్రభుత్వాల అస్థిరత, దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణలు చేపట్టకపోవడం, రక్షణ రంగానికి భారీగా కేటాయింపుల్లాంటి కారణాలతో.. పాకర్‌ అభివృద్ధి కుంటుపడింది. అసలే అప్పుల భారం పెరిగిందంటే.. ఇప్పుడు పశ్చిమాసియా ఉద్రిక్తతలు పాక్ పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. ఇలా దేశం ఆర్థికంగా చితికిపోవడం.. అక్కడి జనాల బతుకులను చిదిమేస్తోంది. ఓ తరం భవిష్యత్‌ను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ప్రశ్నార్థకం చేస్తోంది.

ఒకరి హయాంలోనో.. ఒకరి నిర్ణయం వల్లనో.. పాక్‌కు ఈ పరిస్థితి రాలేదు. దీర్ఘకాలిక నిర్మాణాత్మక సమస్యలు, అర్థం లేని పరిపాలన, భారీ రుణ భారం, రాజకీయ అస్థిరతతో పాక్ ఈ పరిస్థితికి చేరింది. దశాబ్దాలుగా బయట నుంచి అప్పులు చేయడంతో.. ప్రభుత్వ రెవెన్యూలో ఎక్కువ భాగం వడ్డీ చెల్లింపులకే పోతోంది. దీంతో అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోతోంది. రుణ, జీడీపీ నిష్పత్తి ఎక్కువగా ఉండడంతో.. అప్పుల ఊబిలోకి వెళ్తోంది. 2021 నుంచి ఈ సంక్షోభం మరింత తీవ్రం అయింది. ద్రవ్యోల్బణం పెరగడం, కరెన్సీ విలువ పడిపోవడం, విదేశీ మారకం తగ్గడం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్య రావడంలాంటివి జరిగాయి. 2023లో పూర్తిగా దివాళా అంచుకు చేరుకుంది.

ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంపై ఎక్కువ ఆధారపడటం, పారిశ్రామికీకరణ తక్కువగా ఉండటంతో ఉత్పాదక సామర్థ్యం పరిమితికి చేరుకుంది. దీంతో పెద్ద మార్పు రావాలంటే వ్యవసాయం నుంచి పరిశ్రమల వైపు భారీగా మారాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐతే జనాలను పట్టించుకునే నాయకులు పాక్‌లో అరుదు. దీంతో ఆ దేశం తలరాత మారడం.. జనాల బతుకులు బాగుపడడం అసాధ్యమే అనేది మరికొందరిలో చర్చ జరుగుతుంది.