Pakistan Military: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. భారత్ తో యుద్ధానికి పాక్ కాలు దువ్వుతోంది. యుద్ధానికి సై అంటూ పౌరుషానికి పోతోంది. బోర్డర్ లో ఆర్మీని మోహరించింది. క్షిపణి పరీక్ష కూడా చేసింది. ఎల్ వో సీ వెంబడి కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మా దగ్గర అణ్వాస్త్రాలు ఉన్నాయంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలా భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. భారత్ తో యుద్ధానికి సై అంటున్నా.. వాస్తవం మాత్రం మరోలా ఉంది. పాకిస్తాన్ ది మేకపోతు గాంభీర్యమే అనేది స్పష్టమవుతోంది.
నిజానికి పాక్ ఆర్మీ తీవ్రమైన మందుగుండు సామాగ్రి కొరతను ఎదుర్కోంటోంది. వారి దగ్గర ఆయుధాలు ఉన్నా అందులో ఉపయోగించే మందుగుండు సామాగ్రి మాత్రం తక్కువగా ఉందట. ఒక వేళ యుద్ధమే వస్తే కేవలం 4 రోజుల్లోపే పాకిస్తాన్ మందుగుండు అయిపోతుందట.
Also Read: సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబాటు.. బీఎస్ఎఫ్ జవాన్లకు చిక్కిన పాకిస్తాన్ రేంజర్..
పాకిస్తాన్ సైన్యం ఫిరంగి మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటోంది. ఈ కొరత ఆ దేశ యుద్ధ పోరాట సామర్థ్యాలను కేవలం 4 రోజులకే పరిమితం చేసింది. పాక్ ఆర్మీ దగ్గర మందుగుండు సామాగ్రి కొరతకు కారణం యుక్రెయిన్ యుద్ధమే అని తెలుస్తోంది. యుక్రెయిన్ తో పాకిస్తాన్ చేసుకున్న ఆయుధ ఒప్పందాలు దాని యుద్ధ నిల్వలను ఖాళీ చేశాయి. సైన్యానికి మందుగుండును సరఫరా చేసే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. పెరుగుతున్న ప్రపంచ డిమాండ్, కాలం చెల్లిన సౌకర్యాల కారణంగా ఇబ్బందులు పడుతోంది. పాక్ కి అవసరమయ్యేంత ఉత్పత్తి జరగడం లేదు. కేవలం 96 గంటలకు యుద్ధానికి సరిపోయే నిల్వలు మాత్రమే ప్రస్తుతం పాక్ వద్ద ఉన్నాయి.
పాక్ సైన్యం ఎక్కువగా ఆర్టిలరీ, సాయుధ యూనిట్లపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాక్ వద్ద M109 హోవిట్జర్లకు తగినంత 155ఎంఎం షెల్స్ లేవు. BM21 సిస్టమ్స్‌కి అవసరమయ్యే 122ఎంఎం రాకెట్లు లేవు. ఇవి లేకుండా భారత్ ను ఎదుర్కోవడం పాక్ కు సాధ్యం కాదు. ఆర్థిక సంక్షోభం, అప్పులు, ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు కూడా పాక్ సైన్యాన్ని ప్రభావితం చేశాయి.
మందుగుండు సామాగ్రి కొరతతో పాక్ సైనిక అధికారుల్లో ఆందోళన నెలకొంది. భారత్‌తో దీర్ఘకాలిక యుద్ధంలో పాక్ ఆర్మీ పాల్గొనలేదని భయపడుతున్నారు.