సైన్యం చేతిలో ఇమ్రాన్ కీలుబొమ్మ…యూఎస్ రిపోర్ట్

పాకిస్తాన్ లో పెత్తనమంతా సైన్యానిదేనని అమెరికా కాంగ్రెస్‌ నివేదిక సీఆర్‌ఎస్‌ తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నా.. అదంతా మేడిపండు ప్రజాస్వామ్యమేనని తెలిపింది. సీఆర్‌ఎస్‌ అనేది అమెరికాకు చెందిన స్వతంత్ర పరిశోధనా విభాగం. చట్టసభ్యులకు ఆసక్తి కల్గించే అంశాలపై ఇది అవసరమైన నివేదికలు రూపొందిస్తుంటుంది. అమెరికా చట్టసభ్యులకు సమాచారం అందిస్తుంది.ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాక్‌ విదేశాంగ విధానం, భద్రతా విధానాలన్నింటినీ సైన్యం తీవ్రంగా ప్రభావితం చేస్తోందని సీఆర్‌ఎస్‌ నివేదిక తెలిపింది.

అధికారంలోకి రావడానికి ముందు ఇమ్రాన్‌ కు ఎలాంటి పాలనా అనుభవం లేదని. అయితే,  అప్పటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను అధికారంలోనుంచి దించాలనే ఏకైక దురుద్దేశంతో ఎన్నికల సమయంలో పాక్‌ సైన్యం దేశీయ రాజకీయాలను తారుమారు చేసిందని సీఆర్ఎస్ నివేదిక స్పష్టంచేసింది. అలాగే, సైన్యం- న్యాయ వ్యవస్థ అపవిత్ర కలయిక ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పీటీఐకి లబ్ధి చేకూర్చాయని నివేదికలో తెలిపింది. నిషేధానికి గురైన జైష్‌, లష్కర్‌ తొయిబా, ఐసిస్‌ లాంటి ముష్కర గ్రూపులతో సంబంధం ఉన్న చిన్నచిన్న పార్టీలు గత ఎన్నికల్లో పాల్గొనడం మిలిటెంట్లకు మరింత ఊపునిచ్చాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో ఉగ్రవాద సానుభూతి రాజకీయపక్షాలు 10శాతం ఓట్లను సాధించడంపై నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది

ఇమ్రాన్‌ సారథ్యంలోని తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ పార్టీ  నయా పాకిస్థాన్‌ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగి  చాలా మంది యువ, పట్టణ, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షితుల్ని చేశారని.. అభివృద్ధికి సోపానాలు వేస్తున్నట్టు పైకి చెప్పినప్పటికీ అవేమీ సాకారం కావడం లేదని తెలిపింది. అవినీతిని నిరోధించడంతో పాటు మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణను అందించే సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెప్పినప్పటికీ ఆ దిశగా ఇమ్రాన్‌ ప్రయత్నాలేమీ చేయడంలేదని.. ఆయన సైన్యం చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయారని తెలిపింది.

పాకిస్థాన్‌ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటోందని, దీని నుంచి బయటపడాలంటే.. కొత్త దేశీయ రుణాలతో పాటు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. పాక్‌ సైన్యం విదేశాంగ, దేశీయ భద్రతపై ఆధిపత్యం చెలాయించడమే ఎక్కువగా కనబడుతోందని తెలిపింది.