Imran Khan To Resign : పాకిస్తాన్ ప్ర‌ధాని ప‌ద‌వికి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా..?

పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.(Imran Khan To Resign)

Imran Khan

Imran Khan To Resign : పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదివారం తన ప్రధాని పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇస్లామాబాద్ లో రేపు పబ్లిక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలోనే ఆయన తన పదవికి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే చాన్సుంది. ఇప్పటికే ఆ దేశ ఆర్మీ నమ్మకాన్ని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ ముందస్తు ఎన్నికలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నారు ఇమ్రాన్. విశ్వాస ప‌రీక్ష కంటే ముందే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై వ్యతిరేకత తీవ్రమైంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయ‌నున్నార‌నే వార్తలు వస్తున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. తన పదవికి ఆయన రాజీనామా చేయడం తప్పకపోవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కోల్పోయింది. ఇప్పటికే 30 మంది ఎంపీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు.

ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటోన్నారు. తన బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. దీంతో అక్కడ క్యాంప్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎంపీలపై నిఘా ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఇమ్రాన్ ఖాన్.(Imran Khan To Resign)

Pakistan PM Imran : భారత్‌కు సెల్యూట్ చేసిన ఇమ్రాన్ ఖాన్.. విదేశాంగ విధానం భేష్ అంటూ పొగడ్తలు

మిత్ర పక్షాలకు చెందిన సభ్యుల రాజీనామాతో పాకిస్తాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి లేదు. ముందు నుంచీ మిత్రపక్షాల మద్దతుతోనే ఆయన నెట్టుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో మిత్రపక్షాలు సంకీర్ణ కూటమి నుంచి తప్పుకోవడం వల్ల మైనారిటీలో పడింది.

342 మంది సభ్యులున్న పాకిస్తాన్‌ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 172. 2018 నాటి ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి దక్కినవి 155 స్థానాలే. దీంతో ఆయన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇతర పక్షాల మద్దతు తీసుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహా ఇతర మిత్ర పక్షాల సభ్యులు తమ మద్దతు ఉపసంహరించుకున్నాయి.

పీటీఐ ప్రధాన భాగస్వామ పార్టీలు ఎంక్యూఎం-పీ, పీఎంఎల్‌-క్యూ, బీఏపీలు అధికార కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాదు ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. నాలుగేళ్ల ఖాన్‌ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత నేపథ్యంలో మిత్రపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో(పార్లమెంట్‌) ప్రతిపక్షాలు మార్చి 8వ తేదీనే అవిశ్వాసం నోటీసులు ఇచ్చాయి. అప్పటి నుంచి రాజకీయ సమీకరణాలన్నీ ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగానే మారుతున్నాయి. ఈ తరుణంలో ఖాన్‌ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. అధికారం నుంచి గద్దె దింపితే ప్రతిపక్షాలకు మరింత ప్రమాదమని హెచ్చరించారు కూడా.

తన మద్దతు స్థావరాన్ని సమీకరించడానికి మార్చి 27 న రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు ఇమ్రాన్ ఖాన్. ఇక మొత్తం 342 సభ్యులున్న పాక్‌ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి 172 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది. ఇప్పుడు మిత్రపక్షాల దూరంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వ పతనం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.