మహాభారత కాలం నాటి ఆలయాన్నితిరిగి తెరుస్తున్న పాకిస్తాన్

  • Publish Date - December 29, 2019 / 10:26 AM IST

పాకిస్తాన్ లో ఉన్న మహాభారత కాలంనాటి అతి పురాతనమైన హిందూ దేవాలయాన్ని పాకిస్తాన్ 2020లో తెరవబోతోంది. పంచతీర్ధ అనే పేరుగల ఈ పుణ్యతీర్ధం పెషావర్ లో ఉంది. ఇక్కడ 5 కొలనులు ఉన్నాయి. మహాభారత కాలంలో పాండురాజు ఇక్కడి కొలనులో స్నానం చేసినట్లు పురాణ కధనాలు ఉన్నాయి. పంచతీర్ధను జాతీయ సంపదగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన తర్వాత, దానిని పునరుధ్దరించి యాత్రికుల సందర్శనార్ధం జనవరి 2020 లో తెరవబోతోంది. 

ఇప్పటివరకు ఆలయంలోని ఖాళీ ప్రదేశంలో పార్క్ నిర్వహిస్తున్నారు. ఆలయంలోని అనేక కట్టడాలు గోదాములుగా ఉపయోగిస్తున్నారు. వాటినన్నిటిని శుభ్రం చేసి ఇప్పుడు ఆలయం  పరిధిలోకి తీసుకువస్తున్నారు. ఆలయంలోని 5 కోలనులనుకూడా శుభ్రం చేసి సిధ్దం చేస్తున్నారు. 2019 ఏడాది ప్రారంభంలో సియోల్ కోట్ లో ఉన్న వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని తిరిగి తెరిచారు. 2019 సంవత్సరం ప్రారంభలోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని  ప్రముఖ హిందూమత పీఠం  శారదా పీఠాన్ని కూడా పాకిస్తాన్  యాత్రికుల కోసం తెరిచింది. 

ఇటీవల నవంబర్ 9న సిక్కుల మతగురువు గురునానాక్ దేవ్ 550వ జన్మదినోత్సవం సందర్భంగా పాకిస్తాన్, పంజాబ్ రాష్ట్రంలోని కర్తార్ పూర్ గురుద్వారాను తెరిచి భక్తులను అనుమతించింది. భారత్, పంజాబ్ లోని డేరాబాబానానక్ సాహిబ్ గురుద్వారా నుంచి వేలాదిగా భక్తులు పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ గురుద్వారా దర్శనానికి వెళుతున్నారు.