Pakistans Drone Representative Image (Image Credit To Original Source)
Pakistans Drone: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. మా జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయినా పాకిస్తాన్ తీరులో మార్పు రావడం లేదు. మరోసారి పాక్ తోక జాడిస్తోంది. భారత్ ను కవ్వించే ప్రయత్నం చేస్తోంది. కొన్ని రోజులుగా సరిహద్దుల్లో డ్రోన్లను పంపుతోంది. దీంతో పాక్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పాకిస్తాన్ ఎందుకు ఇలా కవ్విస్తోంది? డ్రోన్లను ఎందుకు పంపుతోంది? ఈ చొరబాట్ల వెనుక ఉద్దేశ్యం ఏంటి?
సరిగ్గా 8 నెలల క్రితం జరిగిన ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ముష్కర మూకలపై భారత్ దాడి చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పాక్.. రెచ్చగొట్టే చర్యలను తిరిగి ప్రారంభించింది. జనవరి 9 నుండి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు సెక్టార్లలో పాకిస్తాన్ కు చెందిన డ్రోన్లు కనిపించాయి. పాక్.. అకస్మాత్తుగా ఈ డ్రోన్లను సరిహద్దు దాటి ఎందుకు పంపుతోంది?
నిజానికి, ఇటీవల కనిపించిన డ్రోన్లు చిన్నవి. నిఘా ఆధారిత యూనిట్లు. దీని గురించి ఆర్మీ దినోత్సవం సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రస్తావించారు. పాకిస్తాన్ డ్రోన్ కార్యకలాపాలను గమనిస్తున్నామన్న ఆయన.. ఏదైనా దుస్సాహసం చేస్తే కఠినమైన ప్రతి స్పందనలు ఉంటాయని హెచ్చరించారు.
ఆ డ్రోన్లు చాలా చిన్నవి. లైట్లు వెలుగుతున్నాయి. తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయి. జనవరి 15 (ఆర్మీ డే), జనవరి 26 (రిపబ్లిక్ డే) సమయంలో భారత్ ఏదైనా చర్య తీసుకోవచ్చని పాకిస్తాన్ సాధారణంగా భయపడుతుంది జనవరి 9 నుండి పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (LOC) వెంబడి కనీసం 10-12 డ్రోన్లను పంపింది. గురువారం, పూంచ్ మీదుగా, సాంబాలోని రామ్‌గఢ్ సెక్టార్‌లో డ్రోన్లు కనిపించాయి. గతంలో నౌషెరా, రాజౌరి సెక్టార్‌లలో కూడా డ్రోన్ కార్యకలాపాలు కనిపించాయి. దీంతో మన భద్రతా దళాలు మానవరహిత వైమానిక వ్యవస్థ (యాంటీ-యుఎఎస్) రక్షణలను, కాల్పులను ప్రారంభించాయి” అని ఆర్మీ చీఫ్ తెలిపారు.
”జనవరి 9న సాంబా జిల్లాలో పాకిస్తాన్ నుండి వచ్చిన డ్రోన్ రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, 16 బుల్లెట్లు, ఒక గ్రెనేడ్‌ను పడవేసినట్లు అనుమానిస్తున్నారు. గణతంత్ర వేడుకలకు ముందు తీవ్ర నిఘా మధ్య జరిగిన సోదాల్లో దళాలు వీటిని స్వాధీనం చేసుకున్నాయి. సోమవారం రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ లో అనుమానిత పాకిస్తాన్ డ్రోన్ కనిపించింది” అని ఆర్మీ చీఫ్ వెల్లడించారు.
సడెన్ గా పాకిస్తాన్ ఎందుకిలా భారత్ పైకి డ్రోన్లను పంపుతోంది? అనే దానిపై డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రక్షణ వ్యవస్థలో ఎక్కడైనా లోపాలున్నాయా? మన సైన్యం ఎలా స్పందిస్తోంది? అనేది తెలుసుకోవడమే పాక్ లక్ష్యమని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదుల చొరబాటుకు ఏమైనా దారులున్నాయా అని పాక్ చెక్ చేస్తోందన్నారు. అందుకే పాక్ డ్రోన్ కార్యకలాపాలను వేగవంతం చేసిందంటున్నారు. అయితే ఎక్కడ డ్రోన్ కనిపించినా మన సైన్యం తూటాలతో స్వాగతం పలుకుతోందన్నారు.
పాకిస్తాన్ ‘గుర్తింపు ఆపరేషన్’ కోసం డ్రోన్లను పంపుతోంది. పేలోడ్‌లు లేకుండా పంపే డ్రోన్ భారత్ ప్రతి స్పందనను తనిఖీ చేయడానికే. భారత్ ఏ రాడార్ వ్యవస్థను వాడుతుందో పాకిస్తాన్ చెక్ చేస్తోంది. భారతదేశ సైనిక కదలిక ఏ రంగాలలో పెరుగుతుందో తనిఖీ చేస్తోంది” అని భౌగోళిక రాజకీయ నిపుణుడు సుమిత్ రాజ్ ట్వీట్ చేశారు. భారత రక్షణ వ్యవస్థలో లోపాలను తనిఖీ చేయడానికి పాక్ చేసిన ప్రయత్నమే డ్రోన్ చొరబాట్లు అని విశ్లేషించారు. “భారత సైన్యంలో ఏవైనా గ్యాప్స్, ఏదైనా అలసత్వం ఉందా? ఉగ్రవాదులను పంపగల ఏవైనా గ్యాప్స్ ఉన్నాయా అనేది వారు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు” అని పేర్కొన్నారు.
”పాకిస్తాన్ ఉద్రిక్తతలను పెంచాలని చూస్తోంది. నియామకాలు దాదాపు ఆగిపోయిన ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడానికి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాలను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తుండొచ్చు” అని జమ్మూ కాశ్మీర్ మాజీ టాప్ పోలీస్ అధికారి ఎస్పీ వైద్ అనుమానించారు.