×
Ad

Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌ను వణికించిన భారీ భూకంపం.. నేలకూలిన భవనాలు.. భయంకరంగా ఉన్న వీడియోలు

సముద్ర తీరంలో ఉండే సెబు ప్రావిన్సులోని బోగో నగరానికి 17కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Earthquake Philippines

Earthquake: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం వణికించింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో సెబు ద్వీపం కేంద్రంగా భారీగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు, కార్యాలయాలు కూలిపోయాయి. రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 31మందికిపైగా మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

Philippines Earthquake

సముద్ర తీరంలో ఉండే సెబు ప్రావిన్సులోని బోగో నగరానికి 17కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ నగరంలో 90వేల మంది వరకు జనాభా ఉంది. అర్ధరాత్రి వేళ భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా రోడ్లపైనే భయంతో జాగారం చేస్తూ ఉండిపోయారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి.

Also Read : Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటన.. స్టాలిన్ సర్కార్ సంచలన వీడియో.. ఊపిరి ఆడక, టెంట్ చీల్చుకుని..

భూకంపం కారణంగా ఒక్క బోగోలోనే 14మంది మరణించినట్లు సెబూ గవర్నర్ పమేలా బారిక్యువాట్రో ప్రకటించారు. సాన్ రెమిగియో పట్టణంలో ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి అనేక ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రోడ్లు బీటలు వారాయి. బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. మరోవైపు.. పర్వత ప్రాంతాల్లో ఉన్న గ్రామాలపై కొండచరియలు విరిగిపడటంతో సహాయక బృందాలు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.


భారీ భూకంపం కారణంగా సునామీ వస్తుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే, కొద్దిసేపటి తరువాత పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ హెచ్చరికలను విరమించుకుంది. బంటాయన్‌లోని శాతాబ్దాల నాటి సెయింట్ పీటర్ ది అపోస్టల్ పారిష్ చర్చి పాక్షికంగా కూలిపోయింది. సెబులోని హెరిటేజ్ చర్చి లైట్లు, దాని బయటి పైభాగం కూలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో చర్చి వైపు నుంచి పెద్ద శబ్దం వినిపించింది. స్థానిక ప్రజలు కేకలు వేస్తూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు. చర్చి భవనం పైభాగం కూలిపడడం వీడియోలో కనిపించింది. అయితే, ఆ ప్రాంతంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.


ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉన్న ఈ దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలు కావడంతోపాటు ప్రతీయేటా పదుల సంఖ్యలో తుపానులు విరుచుకుపడుతూ ఉంటాయి. గత వారం రోజుల క్రితం రాగస తుపాను ఫిలిప్పీన్స్ లో బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే అక్కడి వాసులు కోలుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ భూకంపం మరోసారి అక్కడి ప్రజలు వణికించింది.