×
Ad

Tejas Jet Crash: దుబాయ్ లో కుప్పకూలిన భారత యుద్ధ విమానం.. వీడియో వైరల్..

ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసింది.

Plane Crash: దుబాయ్ ఎయిర్ షో 2025లో ప్రమాదం జరిగింది. ఓ యుద్ధ విమానం కుప్పకూలింది. భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ (LCA Mk-1) కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌ షోలో విన్యాసాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో పైలట్‌ మరణించారు. యుద్ధ విమానం ఒక్కసారిగా కూలి భారీగా మంటలు చెలరేగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్(భారత వాయుసేన) స్పందించింది. తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదానికి గురైన ఘటనలో పైలట్‌ మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపింది. పైలట్‌ కుటుంబానికి అండగా ఉంటామంది. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపడతామని వాయుసేన తెలిపింది.

ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసింది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రస్తుతం భారత వాయుసేనలో ఎంకే1 తేజస్‌ జెట్లు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. 2024 మార్చిలో జైసల్మేర్‌లో తేజస్‌ ఫైటర్‌ జెట్‌ కూలిపోయింది.

కాగా, దుబాయ్‌ ఎయిర్‌షో ప్రపంచంలోనే అతి పెద్ద వైమానిక ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ఈ ఎయిర్‌షోలో పాల్గొంటాయి. దుబాయ్ ఎయిర్ షో ఇవాళ చివరి రోజు. ఆఖరి రోజున చోటు చేసుకున్న ఈ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.

Also Read: ఇండియాకు ‘జావెలిన్ మిస్సైల్’ వచ్చేస్తుంది.. శత్రుదేశాలకు ఇక చుక్కలే.. దీని ప్రత్యేకలు ఏంటో తెలుసా..