Plane Crash: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదానికి కారణం ఏమిటి.. ఎంతమంది మరణించారంటే?

దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయల్దేరిన

plane crashes

South Korea Plane Crash: దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయల్దేరిన ది జేజు ఎయిర్ ప్లైట్ కు చెందిన 7సీ2216 నంబర్ బోయింగ్ విమానం మువాన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో అదుపు తప్పి ఎయిర్ పోర్టు రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతోపాటు ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. ఈ ప్రమాదం సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఇందులో ఇద్దరు విమాన సిబ్బంది మినహా మిగిలిన వారంతా మరణించినట్లు తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్య విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రమాదానికి కారణం ఏమిటి..?
మూడు రోజుల క్రితం కజకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అజర్ బైజాన్ నుంచి రష్యాకు వెళ్తున్న విమానం అక్టౌ విమానాశ్రయానికి రెండుమూడు కిలో మీటర్ల దూరంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 38మంది మరణించినట్లు స్థానిక అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదం ఘటన మరవక ముందే దక్షిణ కొరియాలో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకోటం ఆందోళనకు గురిచేస్తోంది. మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయలేదని అధికారులు చెబుతున్నారు. అయితే, ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే అవి పనిచేయకపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. విమానం ల్యాండింగ్ కు యత్నించే సమయంలో ఓ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా నిప్పులు బయటకు వచ్చిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారం అయ్యాయి. దీంతో ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లనే ఇలా జరిగిందన్న అనుమానాలకు బలం చేకూరినట్లయిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఎంత మంది మరణించారంటే..?
విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో 175 మంది ప్రయాణికులతోపాటు మరో ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు. స్థానికంగా యాంహాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇద్దరు సిబ్బంది మినహా.. మిగిలిన 179 మంది మరణించినట్లు పేర్కొంది. విమానం ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వ్యాపించడంతో కొద్దిసేపటికే ఆ విమానం దగ్దమైంది. అప్పటికే రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి సహాయక చర్యలు చేపట్టారు. అయితే, స్థానికంగా కొందరు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. 85మంది మరణించారని చెబుతున్నారు. అయితే, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని గంటల తరువాత విమానం ప్రమాదంలో ఎంత మంది మరణించారనే విషయంపై పూర్తి సమాచారంతో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.