Plane Crash: అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం.. ఫిలడెల్ఫియాలో ఘటన.. పలువురు మృతి

అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది.

Plane Crash

Plane Crash: అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. విమానం ఓ షాపింగ్ మాల్ సమీపంలో కూలిపోయింది. ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లకే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో మంటలు చెలరేగి పలు ఇళ్లు, కార్లు దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. ఫిలడెల్ఫియా ఆఫీస్ ఆఫ్ మెర్జెన్సీ మేనేజ్ మెంట్ సోషల్ మీడియాలో ప్రమాదాన్ని ధృవీకరించింది.

స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదంకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం కూలిన ప్రదేశంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. పలు ఇళ్లు, కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గురైన విమానం ఫిలడెల్ఫియా నుంచి మిస్సౌరీలోని స్ప్రింగ్‌ఫీల్డ్‌కు వెళ్తున్న లియర్ జెట్ 55 అనే మెడికల్ ఎయిర్ క్రాప్ట్ గా గుర్తించారు.

 

ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రితం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ లోని రీగన్ నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో ప్రయాణికుల విమానం, మిలిటరీ హెలికాప్టర్ గాల్లోనే ఢీకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తరువాత విమానం, హెలికాప్టర్ పోటామాక్ నదిలో పడిపోయాయి. విమానంలో నలుగురు సిబ్బందితో సహా 64 మంది ఉండగా.. హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. కొందరి మృతదేహాలను వెలికి తీయగా.. మిగిలిన వారి మృతదేహాలకోసం సిబ్బంది గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో అందరూ మృతిచెందినట్లుగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.