Kolhapuri Chappals : వామ్మో.. ఇండియాలో రూ.500 లోపు ఖరీదు చేసే చెప్పులను అక్కడ లక్ష రూపాయలకు అమ్మేస్తున్నారు..

ప్యారిస్ వాళ్లు ఫ్యాషన్ పేరుతో జనాలను దోచేస్తున్నారని మండిపడుతున్నారు.

Kolhapuri Chappals : షోలాపూర్ చెప్పులు.. చాలా కంఫర్ట్ గా ఉంటాయి. రాజసం ఉట్టిపడేలా కనిపిస్తాయి. వీటికి మన దేశంలో ఫుల్ డిమాండ్ ఉంది. మహారాష్ట్రలో తయారయ్యే షోలాపూర్ చెప్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే.. మన దేశంలో 500 రూపాయల లోపు ఖరీదు చేసే ఈ చెప్పులను అక్కడ లక్ష రూపాయలకు అమ్మేస్తున్నారు. ఏంటి షాక్ అయ్యారు కదూ.. ఇటలీలో ఈ చెప్పులను లక్ష రూపాయలకు అమ్ముతున్నారు. లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రాడా నిర్ణయించిన ధర అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అచ్చం మన షోలాపూర్ చెప్పులను పోలి ఉన్న స్లిపర్స్ ధరను 1.2 లక్షలుగా నిర్ణయించడం విస్మయం కలిగిస్తోంది.

ప్రాడా “కొత్త” పాదరక్షల సేకరణలను రూపొందించింది. ఈ పాదరక్షల డిజైన్.. భారతీయులు యుగయుగాలుగా ఉపయోగిస్తున్న కొల్హాపురి చెప్పులను గుర్తు చేస్తుంది. వీటి ధరను 1.2 లక్షలుగా ట్యాగ్ చేసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ హై ఫ్యాషన్ పాదరక్షలు ప్రీమియం మెటీరియల్స్, ఇండియన్ డిజైన్‌తో రూపొందించబడ్డాయి. కాగా, వీటి ధర ఫ్యాషన్ సర్క్యూట్‌లో చర్చకు దారితీసింది. ఇండియాలో 500 రూపాయలలోపు ఖరీదు చేసే చెప్పులకు లక్ష రూపాయల ప్రైస్ నిర్ణయించడం ఏంటని అంతా విస్తుపోతున్నారు.

కొల్హాపురి చెప్పులు భారత్ లో చాలా సాధారణమైన పాదరక్షలు. సగటు ధరల శ్రేణిలో వస్తాయి. దాదాపు అదే డిజైన్ చేసిన కొల్హాపురి చెప్పుల ధరను ప్రాడా లక్ష రూపాయలకు పైగా నిర్ణయించడం చర్చకు దారితీసింది. అంతేకాదు.. ఈ పాదరక్షల రూపకల్పనకు ప్రాడా భారతదేశానికి ఎటువంటి క్రెడిట్ ఇవ్వకపోవడం మరో షాకింగ్ విషయం.

రబ్బర్ స్లిప్పర్లకు అంత రేటా? అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ చెప్పుల ధర లక్ష రూపాయలా.. ఇది చాలా టూ మచ్ అంటున్నారు. మన దగ్గర డెడ్ చీప్.. అక్కడ ఎందుకు అంత రేట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్యారిస్ వాళ్లు ఫ్యాషన్ పేరుతో జనాలను దోచేస్తున్నారని మండిపడుతున్నారు.

”PRADA కొల్హాపురి చెప్పులను 1.2 లక్షలకు అమ్ముతోంది. ఇది భారత్ లోని చామర్ సమాజం నుండి దొంగిలించబడిన డిజైన్. వారు తరతరాలుగా వాటిని చేతితో తయారు చేస్తున్నారు. క్రెడిట్ లేదు. గుర్తింపు లేదు. లగ్జరీ బ్రాండింగ్ ధరించిన స్వచ్ఛమైన సాంస్కృతిక దొంగతనం. సిగ్గుచేటు” అంటూ నెటిజన్లు ప్రాడాను తిట్టిపోస్తున్నారు.