×
Ad

Putin: ట్రంప్ కి దక్కని నోబెల్ శాంతి బహుమతి.. రష్యా అధ్యక్షుడు పుతిన్ షాకింగ్ కామెంట్స్..

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నేను ఆపా అంటూ ప్రచారం చేసుకున్నా నిరాశ తప్పలేదు ట్రంప్ కి.

Putin: 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే నోబెల్ శాంతి పురస్కారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకోగా అవన్నీ ఆవిరయ్యాయి. ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అన్ని విధాలుగా అర్హుడు అని పుతిన్ అన్నారు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతున్నారని ట్రంప్ పై ప్రశంసల వర్షం కురిపించారు. శాంతి కోసం పని చేయని పలువురికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, అది తన ప్రతిష్ఠను కోల్పోయింది అంటూ హాట్ కామెంట్స్ చేశారు పుతిన్. అటు నోబెల్ పీస్ ప్రైజ్‌కు ట్రంప్ అర్హులు అని ఇజ్రాయల్ ప్రధాని నెతన్యాహు సైతం అన్నారు.

ట్రంప్ ఎంతగానో ఆశించిన నోబెల్ శాంతి బహుమతి ఈసారి కూడా అందని ద్రాక్షే అయ్యింది. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నేను ఆపా అంటూ ప్రచారం చేసుకున్నా నిరాశ తప్పలేదు ట్రంప్ కి. 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని వెనిజులాకు చెందిన విపక్ష నేత, ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు ప్రకటించింది నోబెల్ కమిటీ. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నిరంకుశత్వంలోకి జారుకుంటున్న ప్రస్తుత తరుణంలో వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం, శాంతి కోసం మరియా మచాడో చేస్తున్న అలుపెరుగని పోరాటానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. వెనిజులాను డిక్టేటర్‌‌షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారని కితాబిచ్చారు.

ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ రాకపోవడంపై వైట్ హౌస్ ప్రతినిధి హాట్ కామెంట్స్ చేశారు. శాంతి కంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ పెద్దపీట వేస్తుందని మరోసారి రుజువైందన్నారు. అయినా ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు ఆపేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉంటారని ఆయన చెప్పారు. ట్రంప్ మానవతావాది, శాంతి ఒప్పందాలతో ప్రాణాలు నిలబెడతారు అని వైట్‌హౌజ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.